Abn logo
Sep 25 2021 @ 00:11AM

భారీ అగ్నిప్రమాదం

ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌ ఆవరణలోని గోడౌన్‌లో దగ్దమవుతున్న దూది బేళ్లు

ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌లో మంటలు

రూ. కోట్లలో ఆస్తి నష్టం


యడ్లపాడు, సెప్టెంబరు 24: చెన్నై- కోల్‌కతా జాతీయరహదారి ప్రక్కన యడ్లపాడు పరిధిలోగల ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు ఆవరణలోని ఓ భారీ గోడౌన్‌ నుంచి మంటలు రావడం గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసు, అగ్నిమాపకశాఖల అధికారులకు సమాచారం అందించారు. దీనితో చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక దళాలు ఫైర్‌ ఇంజన్లు తెప్పించి మంటలను అదుపులోకి చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అంతేగాకుండా మండల పరిధిలోని బోయపాలెం, తిమ్మాపురం, నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామాల పరిధిలోని నూలు మిల్లుల నుంచి వాటర్‌ ట్యాంకర్లను కూడా రప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోడౌన్‌ నలుమూలలా మంటలు వ్యాపించడంతో అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది. శనివారం ఉదయానికి కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. గోడౌన్‌లో వేలసంఖ్యలో దూది బేళ్ళు ఉన్నాయని, రూ.కోట్లలో ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అందుబాటులో ఉన్న మిల్లు అధికారులు సైతం ఎంత మేర నష్టం వాటిల్లిందో, ప్రమాదానికి గల కారణాలు చెప్పలేకపోతున్నారు.