పేలిన రియాక్టర్‌

ABN , First Publish Date - 2022-07-24T06:40:13+05:30 IST

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం రియాక్టర్‌ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

పేలిన రియాక్టర్‌
ఎగిసిపడుతున్న మంటలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. 

పెద్దమొత్తంలో ఆస్తినష్టం  


జీడిమెట్ల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం రియాక్టర్‌ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది. ఇద్దరు కార్మికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడ సమీపంలోని ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలో వశిష్ట లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్న పరిశ్రమలో బల్క్‌డ్రగ్స్‌కు అవసరమైన ముడిపదార్థలను తయారుచేస్తుంటారు. శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో రియాక్టర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించి పేలింది. టీ సమయం కావడంతో కార్మికులంతా రియాక్టర్‌కు దూరంగా ఉండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పేలిన శబ్ధానికి వారు బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్‌ అధికారి సుభా్‌షరెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. జీడిమెట్ల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, పీసీబీ అధికార ప్రవీణ్‌కుమార్‌లు కంపెనీని పరిశీలించారు. 


ఇద్దరికి తీవ్రమైన గాయాలు..

రియాక్టర్‌ శకలాలు ఎగిసి పడి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న సుభా్‌షనగర్‌ వాసి సురేష్‌ (26), బీరంగూడ వాసి దినే్‌షలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుమతి లేని ప్రమాదకరమైన సోడియం బ్యాచ్‌లు వేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం మాత్రం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు చెబుతోంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-24T06:40:13+05:30 IST