తుపాకి కేసు దర్యాప్తు.. వెలుగులోకి మరో దారుణ విషయం

ABN , First Publish Date - 2021-03-30T02:39:15+05:30 IST

మారణాయుధాల కేసును దర్యాప్తు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన దారుణ విషయం పోలీసులను షాక్‌కు గురిచేసింది

తుపాకి కేసు దర్యాప్తు.. వెలుగులోకి మరో దారుణ విషయం

పూణె: మారణాయుధాల కేసును దర్యాప్తు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన దారుణ విషయం పోలీసులను షాక్‌కు గురిచేసింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన. అక్రమంగా తుపాకి కలిగి ఉన్నాడంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇటీవల శ్రీకాంత్ కాలే (23)ను అరెస్ట్ చేశారు. అతడికి ఆ పిస్టల్ ఎలా వచ్చిందని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఆ తుపాకిని రెండు రోజుల క్రితం ఉపయోగించినట్టు తేలింది. మరింత ఆరా తీయగా, సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. 


పోలీసుల కథనం ప్రకారం.. 15 రోజుల క్రితం 14 ఏళ్ల బాలిక తన స్నేహితురాలితో కలిసి పూణెలోని కాలే ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ కాలేతోపాటు మరికొందరు ఉన్నారు. వారు కూడా బాలికకు పరిచయం ఉన్నవారేనని పోలీసులు తెలిపారు.


కాలే, మరో ఇద్దరు కలిసి ఫ్లాట్ బయట మరో బాలికతో కలిసి ఉండగా, లోపల ముగ్గురు యువకులు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్తానని చెప్పగా, కాలే అడ్డుకున్నాడు. అక్కడే ఉండాలని హుకుం జారీ చేశాడు. అయినప్పటికీ బాలిక అంగీకరించకపోవడంతో కోపంతో ఊగిపోయిన కాలే తుపాకితో ఆమెను కాల్చాడు. అయితే, అదృష్టవశాత్తు బాలిక పట్టుకున్న మొబైల్ ఫోన్‌కు తూటా తాకడం చిన్న పాటి గాయాలతో ఆమె బయటపడింది. 


ఈ ఘటనతో భయపడిపోయిన నిందితులు బాలిక గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలిక, ఆమెతో వచ్చిన అమ్మాయిని హెచ్చరించి పంపించివేశారు.  కాలే ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బాలికను గుర్తించారు. నిందితులపై హత్యాయత్నం, గ్యాంగ్‌రేప్ కేసులు నమోదు చేశారు.  ముగ్గురు నిందితులు, ఇద్దరు బాలురను అరెస్ట్ చేశారు.  

Updated Date - 2021-03-30T02:39:15+05:30 IST