మళ్లీ మంటలు!

ABN , First Publish Date - 2020-09-19T11:14:22+05:30 IST

బొబ్బిలి ఏపీఐఐసీ (గ్రోత్‌ సెంటర్‌) భూముల్లో సాగుపై గతంలో తలెత్తిన వివాదం మళ్లీ తెరపైకి వస్తోంది. ఆ భూముల్లో రైతులు చాలా ఏళ్ల నుంచి పంటలను సాగు చేస్తున్నారు.

మళ్లీ మంటలు!

తెరపైకి గ్రోత్‌సెంటర్‌ భూముల వ్యవహారం

300 ఎకరాల్లో పంటలు సాగు

నోటీసుల జారీకి అధికారుల కసరత్తు


బొబ్బిలి, సెప్టెంబరు 18:

బొబ్బిలి ఏపీఐఐసీ (గ్రోత్‌ సెంటర్‌) భూముల్లో సాగుపై గతంలో తలెత్తిన వివాదం మళ్లీ తెరపైకి వస్తోంది. ఆ భూముల్లో రైతులు చాలా ఏళ్ల నుంచి పంటలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించేసిన భూముల్లో సాగు చేస్తుండడాన్ని గతంలో అధికారులు ప్రశ్నించారు.


దీనిపై అనేకమార్లు గొడవలు, పంచాయితీలు నడిచాయి. పరిశ్రమలు ఏర్పాటు కాని ఆ భూముల్లో అప్పటి  యజమానులైన రైతులు నేటికీ  మెట్టు పంటలను సాగు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో 114 మంది రైతులు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ మరోసారి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తరువాత వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు ఏపీఐఐసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


గతంలో ఇదే తరహాలో అఽధికారులు  చర్యలు చేపట్టినప్పుడు గ్రోత్‌సెంటరును ఆనుకొని ఉన్న మెట్టవలస గ్రామరైతులంతా ఏకమై అధికారులను నిలువరించారు. పోలీసులు కూడా జోక్యం చేసుకున్నప్పటికీ రైతులంతా ముక్తకంఠంతో తాము పంటల సాగు ఆపబోమని... ఈ భూముల్లో ఎవరైనా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే ఆ వెంటనే చేతికొచ్చిన పంటలను సైతం వదిలేస్తామని చెప్పడంతో అప్పట్లో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు ఈ భూములను రైతులు ఖాళీ చేయాల్సిందేనని ఏపీఐఐసీ పట్టుబడుతోంది. 


 పంట ఉంటే ఎవరూ ముందుకు రావడం లేదు... - బి.సుధాకర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌, శ్రీకాకుళం

గ్రోత్‌సెంటర్‌లో 300 ఎకరాల ఏపీఐఐసీ భూములను రైతులు సుమారు 12 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ భూములన్నింటినీ ఖాళీ చేయాలని కరపత్రాలు, దండోరా, ఇతర ప్రకటనల ద్వారా కోరేందుకు కలెక్టర్‌, ఏపీఐఐసీ ఉన్నతాధికారుల అనుమతి కోరాం. ఆ  ప్రక్రియ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఆ భూముల్లో పంటలు కనిపిస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 


సాగుతో ఎటువంటి నష్టం లేదు... పువ్వల మాధవరావు, మాజీ సర్పంచ్‌, మెట్టవలస 

పంటల సాగువల్ల ఎటువంటి నష్టం లేదు. గ్రోత్‌సెంటర్‌  ఏర్పాటుకు అప్పట్లో కారుచౌకగా ప్రభుత్వానికి భూములు ఇచ్చాం. ఎకరా రూ.20 వేల లోపు ధరకు ప్రభుత్వానికి అందజేశాం. ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా ధరలు పలుకుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం భూములు కోల్పోయిన వారికి, స్థానిక యువకులకు ఉపాధి లభించడం లేదు. పరిశ్రమలు ఏర్పాటైతే తక్షణమే సాగు చేసుకుంటున్న భూములన్నింటినీ యథాతథంగా వదిలేస్తాం.       -

Updated Date - 2020-09-19T11:14:22+05:30 IST