Abn logo
Dec 5 2020 @ 00:41AM

హెచ్‌పీసీఎల్‌ చిమ్నీ నుంచి మంటలు

దట్టమైన పొగ రావడంతో జనం బెంబేలు

ఎటువంటి ప్రమాదం లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్న వైనం


మల్కాపురం, డిసెంబరు 4: హెచ్‌పీసీఎల్‌ చిమ్నీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారీఎత్తున మంట, దట్టమైన నల్లటి పొగ ఎగసిపడడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రెండు గంటల పాటు మంటలు రావడంతో హెచ్‌పీసీఎల్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాగా చిమ్నీకి అనుసంధానంగా వున్న ఓ యూనిట్‌ ఇటీవల షట్‌డౌన్‌ అయింది. దానిని తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభించిన నేపథ్యంలోనే  చిమ్నీ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ నిప్పురవ్వలు పక్కనే వున్న కొండపై పడడంతో అక్కడ కూడా మంటలు చెలరేగాయి. ఒకేసారి రెండుచోట్ల మంటలు రావడంతో హెచ్‌పీసీఎల్‌లో ఏదో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన చెందారు. కొంతసేపటికి అటువంటిదేమీ లేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే గణబాబు...హెచ్‌పీసీఎల్‌ అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. యంత్రాలు ట్రిప్‌ అయినప్పుడు వెలువడే వాయువును కాల్చివేస్తుంటామని, అయితే ఈసారి ఆ మంటలు పక్కనే వున్న కొండకు అంటుకోవడంతో తీవ్రత ఎక్కువగా కనిపించిందని అధికారులు వివరించారు. మంటలను అదుపు చేశామని, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement