భగ్గుమంటున్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-19T06:22:42+05:30 IST

వేతన సవరణకు ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.

భగ్గుమంటున్న ఉద్యోగులు

హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడంపై ఆగ్రహం

జీవీఎంసీ పరిధిలో ఉద్యోగులకు గతంలో 20ు, ఇకపై 16ు

మునిసిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల వారీకి 8 శాతమే...

గతం కంటే 4 నుంచి 6.5 శాతం వరకూ తగ్గింపు

మొత్తంగా చూస్తే తగ్గుదలే...

పెండింగ్‌ డీఏలు కలిపి వేతనం పెరిగిందంటూ ప్రభుత్వం దబాయిస్తుందని మండిపాటు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగర, గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల వేతనాలు పరిశీలిస్తే...తేడాలు ఇలా ఉన్నాయి. నగరంలో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ పాత జీతం ప్రకారం చూసుకుంటే మూల వేతనం రూ.46,060, 33.536 శాతం డీఏ 15,446, 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద 9,212, 27 శాతం ఐఆర్‌ ప్రకారం 12,436 మొత్తం 83,154 డ్రా చేసేవారు. అదే కొత్త పీఆర్‌సీ ప్రకారం మూల వేతనం 70,850, 2.73 శాతం డీఏ 1,934, 16 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద 11,336 వెరసి 84,120 వస్తుంది. అంటే పాత జీతం కంటే వేతన సవరణ తరువాత పెరిగేది కేవలం 966 రూపాయలు మాత్రమే. 

అదే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్‌ పాత జీతం ప్రకారం చూసుకుంటే మూల వేతనం రూ.46,060, 33.536 శాతం డీఏ కింద 15,446, 12 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద 5,527, 27 శాతం ఐఆర్‌ ప్రకారం 12436...మొత్తం 79,469 జీతం వచ్చేది. అదే కొత్త పీఆర్‌సీ ప్రకారం మూల వేతనం 70,850, 2.73 శాతం డీఏ కింద 1,934, 8 శాతం హెచ్‌ఆర్‌ఏ 5,668...వెరసి 78,452 జీతంగా వస్తుంది. ఈ లెక్కన పాత జీతం కంటే వేతన సవరణ తరువాత జీతంలో 1,017 రూపాయలు కోత పడనున్నది. 


వేతన సవరణకు ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. అభిమానించి ఓటు వేసినందుకు తమకు ఇచ్చే బహుమానం ఇదేనా...అంటూ పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరిస్తూ బకాయిపడిన ఐదు డీఏలను కలిపేసి...వేతనం పెరిగిందంటూ దబాయించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికీ మోసం చేయడమేనంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు.


ఫిట్‌మెంట్‌ 23 శాతం మాత్రమే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ విషయంలో కొంత దయ చూపుతుందని భావించిన ఉద్యోగులకు సోమవారం రాత్రి విడుదల చేసిన జీవో షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుసరించి హెచ్‌ఆర్‌ఏ, ఇతరత్రా అంశాలపై సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు లెక్కలేసుకున్నారు. 


ప్రతి ఐదేళ్లకు ఇచ్చే వేతన సవరణ పెరిగిన ధరల సూచీ మేరకు ఉండాలి. అంటే ప్రతి పీఆర్‌సీలో ఉద్యోగుల మూల వేతనం పెరుగుతుంది. అటువంటిది ఈ పర్యాయం మూల వేతనంలో భారీ కోత పడింది. దీనికి సర్దుబాటుగా ప్రభుత్వం పెండింగ్‌లో వున్న ఐదు డీఏలు కలిపి చూపించింది. కనీస మూల వేతనానికి 23 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జూలై ఒకటో తేదీ నాటికి పెండింగ్‌లో వున్న 30.392 శాతం డీఏలు కలిపి కొత్త వేతనంగా సవరించింది. దీనికి హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఫిట్‌మెంట్‌ ప్రభుత్వం ఇచ్చిన 23 శాతం కంటే మరింత తగ్గుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. 


హెచ్‌ఆర్‌ఏలో రెండు శ్లాబ్‌లే...

ఇప్పటివరకు హెచ్‌ఆర్‌ఏకు సంబంధించి జిల్లాలో మూడు శ్లాబ్‌లు ఉండేవి. జీవీఎంసీ పరిధిలో 20 శాతం, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో 14.5 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండేది. ఇక నుంచి జీవీఎంసీ పరిధిలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయనున్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కేవలం 8 శాతం మాత్రమే హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. ఈ నిర్ణయం జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 46 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 28 వేల మంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటివరకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటుండగా...ఇకపై 16 శాతమే వస్తుంది.  అలాగే 2019 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు 23 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయడంతో ప్రస్తుత నెలవరకు తీసుకున్న ఐఆర్‌ తేడాను ఉద్యోగుల వేతనం నుంచి క్రమేపీ రికవరీ చేస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. 


సిటీ అలవెన్స్‌ కట్‌..

జీవీఎంసీలో పనిచేసే ఉద్యోగులకు వారి హోదాను బట్టి నెలకు 350 నుంచి 700 వరకు సీసీఏ అలవెన్స్‌ ఇస్తారు. తాజాగా ఇచ్చిన జీవో ప్రకారం సీసీఏను ఇక నుంచి ఇచ్చేది లేదని ప్రభుత్వం తెల్చేసింది. 


పదేళ్లకు పీఆర్‌సీయా?

అలాగే ఐదేళ్లకు ఒకసారి అమలు చేస్తున్న పీఆర్‌సీని ఇకపై పదేళ్లకు పొడిగిస్తున్నట్టు చెప్పడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తాజాగా పెంచిన గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో కూడా కక్ష సాధింపుగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. తాజా జీవో ప్రకారం 2018 జూలై ఒకటో తేదీ నుంచి మూల వేతనం పెంచి దానిని 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. అయితే 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021 డిసెంబరు నెలాఖరు వరకూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ వర్తించదని చెప్పడాన్ని నిరసిస్తున్నారు. 


ఉపాధ్యాయుల ఆందోళన

జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, జీవోల ప్రతులు దహనం

దశల వారీ పోరాటానికి సన్నద్ధం 

కలెక్టరేట్‌ ముట్టడి రేపు


విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ, దానికి అనుబంధంగా జారీ అయిన జీవోలపై మంగళవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంపై దశల వారీ పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాగా ప్రభుత్వం పెండింగ్‌లో వున్న ఐదు డీఏలను సర్దుబాటు చేసి జీతం పెరిగిందని ప్రకటించడాన్ని ఏపీ ఎన్‌జీవో విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తప్పుబట్టారు. ఇప్పటివరకు జగన్మోహన్‌రెడ్డిపై ఎంతో గౌరవంగా ఉండేవారమని, ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏపై కోత విధించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పీఆర్‌సీ అమలు నుంచి హెచ్‌ఆర్‌ఏ కోత వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎస్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పైడిరాజు, జిల్లా అధ్యక్షుడు దేముడుబాబు ఖండించారు. తక్షణమే ప్రభుత్వం వీటిపై పునరాలోచన చేయాలని పీఆర్‌టీయూ సీనియర్‌ నేత గోపినాథ్‌ డిమాండ్‌ చేశారు. కాగా అర్ధరాత్రి జారీచేసిన అర్థరహిత పీఆర్‌సీ జీవోలను తిప్పికొట్టాలని ఫ్యాక్టో భాగస్వామ్య సంఘ నాయకులు జి.మధు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చీకటి జీవోలను జారీచేయడం సమంజసం కాదని మండిపడ్డారు. మధ్యంతర భృతి కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించడం, అమలులో వున్న ఇంటి అద్దె రేట్లు కుదింపు, ప్రతి ఐదేళ్లకు వచ్చే పీఆర్‌సీని పదేళ్లకు పెంపు వంటి చర్యలను ఆయన ఖండించారు.



Updated Date - 2022-01-19T06:22:42+05:30 IST