తొలి బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-05-17T05:09:24+05:30 IST

ఇప్పటివరకు కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌.. సెకండ్‌ వేవ్‌తో భయంగుప్పిట్లో జీవిస్తున్న జనాలకు కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ కలవరపెడుతోంది. ఇప్పటివరకు వినడం తప్ప ఎలాంటి కేసులు నమోదు కాలేదని జిల్లావాసులు ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో తొలిసారిగా ఒంగోలులో ఈ కేసు నమోదైంది. ఒంగోలు శర్మా కాలేజి ఎదురు, సీతారాంపురం ఏరియాకు చెందిన కందిపట్ల శ్రీను, గతంలో ఓ ప్రైవేటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేసి మానేశాడు. అయితే గత ఏప్రిల్‌లో కొవిడ్‌ బారినపడి కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.

తొలి బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదు!
చెన్నై ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడు శ్రీను

ఒంగోలు నగరంలోని సీతారాంపురం వాసి

చెన్నై ప్రైవేటు ఆస్పత్రిలో చేరిక

ఒక కన్ను కోల్పోయిన బాధితుడు

దాతల సహాయం కోసం ఎదురుచూపులు

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 16 : ఇప్పటివరకు కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌.. సెకండ్‌ వేవ్‌తో భయంగుప్పిట్లో జీవిస్తున్న జనాలకు కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ కలవరపెడుతోంది. ఇప్పటివరకు వినడం తప్ప ఎలాంటి కేసులు నమోదు కాలేదని జిల్లావాసులు ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో తొలిసారిగా ఒంగోలులో ఈ కేసు నమోదైంది. ఒంగోలు శర్మా కాలేజి ఎదురు, సీతారాంపురం ఏరియాకు చెందిన కందిపట్ల శ్రీను, గతంలో ఓ ప్రైవేటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేసి మానేశాడు. అయితే గత ఏప్రిల్‌లో కొవిడ్‌ బారినపడి కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. శ్రీనుకు పదిహేనురోజుల క్రితం ఒక కన్ను మూసుకుపోయింది. అయితే చీమకుట్టిందన్న భావనతో ఐ డ్రాప్స్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే రెండుమూడు రోజులైనా నయం కాకపోవడంతో కంటి వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు అది బ్లాక్‌ ఫంగస్‌ ఎఫెక్ట్‌ అని గుర్తించారు. దీనికి చికిత్స హైదరబాద్‌, చెన్నైలో మాత్రమే ఉందని, కంటిని తొలగించాలని వైద్యులు సూచించడంతో శ్రీను దంపతులు హైదరాబాద్‌కు వెళ్ళారు. అయితే అక్కడ అన్నీ ఆసుపత్రులు తిరిగినా ఎలాంటి వైద్యం లభించకపోవడంతో ఈనెల 12న చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అతనికి ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు. అలాగే ఇన్ఫెక్షన్‌ మెదడుకు చేరే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వైద్యం ఖర్చు సుమారు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలియజేయడంతో శ్రీను భార్య మాలతి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కందుకూరు మునిసిపాలిటీలో వార్డు సచివాలయం-3లో ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న మాలతికి శ్రీనుతో ఆరునెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణీ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీను దంపతులు ఇప్పటికే స్థోమతకు మించి రూ.4లక్షల వరకు ఖర్చచేయగా, ఇంకా రూ.15లక్షలు అవసరం ఉండటంతో దాతల సహాయాన్ని ఆర్థిస్తున్నారు. సహాయం చేయదలచిన వారు 7794896521 ద్వారా గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా పంపాలని ఆమె కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఒంగోలులో తొలి కేసు నమోదు కావడం కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-05-17T05:09:24+05:30 IST