Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింగరేణిలో తొలిరోజు సమ్మె సక్సెస్‌

మంచిర్యాల: సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బావుల్లో చేపట్టిన సమ్మె తొలి రోజు గురువారం విజయవంతం అయింది. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌తోపాటు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ గురువారం నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలోని ఓసీపీలు, అండర్‌ గ్రౌండ్‌మైన్లు, కార్యాలయాల్లో దాదాపు 16వేల మంది కార్మికులు పని చేస్తుండగా వీరంతా విధులకు గైర్హాజరయ్యారు. మూడు ఏరియాల పరిధిలో మొదటి షిప్టు నుంచి సమ్మె ప్రారంభం కాగా సుమారు 28వేల పై చిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడగా దాదాపు రూ. 58 కోట్లకుపైగా సింగరేణికి నష్టం వాటిల్లింది. అత్యవసర సిబ్బంది మినహా ఓపెన్‌ కాస్టు, అండర్‌ గ్రౌండ్‌ మైన్లలో కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. సమ్మెను పురస్కరించుకొని జేఏసీగా ఏర్పడ్డ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు విధులకు హాజరుకాకుండా గనుల వద్ద గస్తీ తిరిగారు. సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మందమర్రిలో జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. 

Advertisement
Advertisement