వరద గోదావరి

ABN , First Publish Date - 2021-07-26T08:11:04+05:30 IST

గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం స్పిల్‌వే దగ్గర కొంత నిలకడగా ఉన్నా, దిగువకు చేరే సరికి ప్రవాహం ఉధృతంగానే ఉంది.

వరద గోదావరి

  • ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • సముద్రంలోకి 10,11,382 క్యూసెక్కుల నీరు
  • భద్రాచలం వద్ద తగ్గుతున్న వరద
  • కృష్ణానదిలోనూ భారీగా వరద
  • శ్రీశైలానికి 3.78 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • తుంగభద్ర డ్యాం 10 గేట్లు ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం స్పిల్‌వే దగ్గర కొంత నిలకడగా ఉన్నా, దిగువకు చేరే సరికి ప్రవాహం ఉధృతంగానే ఉంది. పోలవరం స్పిల్‌ వే నుంచి ఆదివారం 8.90 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ నీరంతా ధవళేశ్వరం బ్యారేజ్‌ వైపు సాగుతోంది. దీంతో పరివాహకంలోని గ్రామాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పోలవరం ఎగువన  19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ముంపు మండలాల్లోని నిర్వాసితులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రాన్ని గోదావరి తాకింది. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వేపై నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది.


ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పునరావాస శిబిరాలను జేసీ హిమాన్షుశుక్లా సందర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు వరద తాకిడి పెరిగింది. పోలవరం ఏజెన్సీ గ్రామాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రి 7గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భద్రాచలం వద్ద సుమారు 49 అడుగులకు చేరిన నీటిమట్టం 40.70 అడుగులకు తగ్గింది. ధవళేశ్వరంలో 175 గేట్లు ఎత్తివేయడంతో 10,11,382 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. బ్యారేజి వద్ద నీటిమట్టం 11.80 అడుగులు నమోదైంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.  రెండు రోజుల్లో ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.


శ్రీశైలంలో 865.5 అడుగుల నీరు

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద వస్తోంది. జూరాలకు సామర్థ్యానికి మించి నీరు వస్తుండడంతో స్పిల్‌వే ద్వారా  4,05,415 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చే స్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 3,78,974 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 865.5 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను, 124.2 టీఎంసీల నీరు చేరింది. అలాగే, తెలంగాణ పవర్‌ హౌస్‌ నుంచి 25,426 క్యూసెక్కులు విడుదలవుతోంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వస్తోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 2,57,621 క్యూసెక్కులు వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1627 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు గాను ప్రస్తుతం 85 టీఎంసీల నీరు ఉంది.

Updated Date - 2021-07-26T08:11:04+05:30 IST