ఆలయ ఈవోగా కలెక్టర్‌!

ABN , First Publish Date - 2021-05-05T07:58:03+05:30 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్‌ సీతారామస్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఆలయ ఈవోగా కలెక్టర్‌!

  • దేవాదాయ శాఖ చరిత్రలో ప్రథమం 
  • దేవరయాంజాల్‌ ఇన్‌చార్జి ఈవో 
  • తొలగింపు.. ట్రైబ్యునల్‌ మెంబరూ..
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం 
  • ఆక్రమణల కేసు నేపథ్యంలో చర్య
  • ఐఏఎస్‌ల కమిటీకి ఫైళ్లు అందజేత


హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్‌ సీతారామస్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఒక ఐఏఎస్‌ అధికారి.. జిల్లా కలెక్టర్‌గా ఉండి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టడం దేవాదాయశాఖ చరిత్రలో ఇదే మొదటిసారి. విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం కావడంపై సీరియ్‌సగా ఉన్న ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవాదాయ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ ట్రైబ్యునల్‌ మెంబర్‌గా ఉన్న జ్యోతిని  ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఎలాంటి పోస్టింగ్‌ లేకుండా ప్రభుత్వం వద్ద రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక ఆలయ ఈవో చంద్రమోహన్‌ను దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఈ ఆలయం దేవాదాయశాఖ పరిఽధిలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ ఇన్‌చార్జి ఈవోగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లాంగ్‌ స్టాండింగ్‌పై అక్కడి నుంచి బదిలీ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా వివిధ కారణాలతో అక్కడే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎట్టకేలకు అక్కడి నుంచి తొలగించారు. 


కమిటీ చేతికి కీలక ఫైళ్లు 

ఆలయ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు ఐఏఎ్‌సల కమిటీకి దేవాదాయశాఖ అధికారులు కీలక ఫైళ్లు అందజేశారు. కమిటీ అడిగిన పలు అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, భారతి హోళికేరి, శ్వేతా మహంతితో ఏర్పాటైన కమిటీ ఆలయ భూముల ఆక్రమణల నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది. కమిటీ రోజువారి పనికోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కమిటీకి సహకారం అందించేందుకు ఆయా శాఖల నుంచి అనుభవజ్ఞులైన అధికారుల్ని సహాయకులుగా కేటాయించారు. 

Updated Date - 2021-05-05T07:58:03+05:30 IST