రష్యాలో వందేళ్ల తర్వాత తొలి రాజ వివాహం.. దీనికో ప్రత్యేకత!

ABN , First Publish Date - 2021-10-03T00:08:41+05:30 IST

రష్యా రాజ కుటుంబానికి చెందిన వారసుడు శుక్రవారం ఇటలీకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు.

రష్యాలో వందేళ్ల తర్వాత తొలి రాజ వివాహం.. దీనికో ప్రత్యేకత!

సెయింట్ పీటర్స్‌బర్గ్: రష్యా రాజ కుటుంబానికి చెందిన వారసుడు శుక్రవారం ఇటలీకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. జార్ల కాలం తర్వాత అంటే దాదాపు వందేళ్ల తర్వాత రష్యా గడ్డపై ఇలాంటి వివాహం జరగడం ఇదే తొలిసారి. ఇటలీకి చెందిన విక్టోరియా రోమనోవ్నా బెట్టారిని గ్రాండ్ డ్యూక్ జార్జ్ మిఖైలోవిచ్ రోమనోవ్ వెళ్లాడారు. రష్యా పూర్వ సామ్రాజ్య రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సెయింట్ ఇజాక్ కెథెడ్రల్‌లో ఈ వివాహం జరిగింది. 


రష్యా సనాతన మతాధికారులు ఈ వేడుకను నిర్వహించారు. పెళ్లి కుమారుడి తల్లి, జార్ చక్రవర్తి మనవరాలు మారియా వ్లాదిమిరోవ్నాసహా వందలాదిమంది అతిథులు ఈ వేడుకను తిలకించారు. అలాగే, పలువురు యూరోయిన్ రాజవశంస్థులు కూడా పాల్గొన్నారు. జార్జ్ మిఖైలోవిచ్ ముత్తాత, గ్రాండ్ డ్యూక్ కిరిల్ వ్లాదిమిరోవిచ్1917 బోల్ష్‌విక్ విప్లప సమయంలో రష్యా నుంచి నుంచి పారిపోయారు. తొలుత ఫిన్లాండ్‌కు పారిపోయారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి పశ్చిమ యూరోప్‌కు మకాం మార్చారు. 


జులై 1918లో విప్లవకారుల బృందం చేతిలో రష్యా చివరి జార్ నిఖోలస్ II, ఆయన భార్య, ఐదుగురు చిన్నారులు హత్యకు గురయ్యారు. జార్జ్ మిఖైలోవిచ్ (40) మాడ్రిడ్‌లో జన్మించారు. స్పెయిన్, ఫ్రాన్స్‌లో చాలాకాలం నివసించారు. గతేడాది రష్యా సనాతన విశ్వాసాన్ని స్వీకరించిన 39 ఏళ్ల బెట్టారిని  విక్టోరియా రోమనోవ్నాగా పేరు మార్చుకున్నారు. ఆమె తండ్రి రోబెర్టో బెట్టారిని ఇటలీ దౌత్యాధికారిగా పనిచేశారు. 


జార్జ్ మిఖైలోవిచ్ 1992లో తొలిసారి రష్యాను సందర్శించారు. 2019లో మాస్కోకు మకాం మార్చారు. నికోలస్ II 1917 తొలినాళ్లలో పదవీ త్యాగం చేయడానికి ముందు రోమనోవ్ రాజవంశం 300 సంవత్సరాలకు పైగా రష్యాను పాలించింది. 

Updated Date - 2021-10-03T00:08:41+05:30 IST