తడబడుతూ.. తొలి అడుగు

ABN , First Publish Date - 2021-01-17T07:01:02+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైర్‌సను నివారించేందుకు తయారుచేసిన టీకా కొవిషీల్డ్‌ను శనివారం హెల్త్‌ వర్కర్స్‌కు వేశారు.

తడబడుతూ.. తొలి అడుగు
-రుయాస్పత్రిలో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ తదితరులు

తొలిరోజు 72 శాతంమందికి కరోనా వ్యాక్సిన్‌

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

చిత్తూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైర్‌సను నివారించేందుకు తయారుచేసిన టీకా కొవిషీల్డ్‌ను శనివారం హెల్త్‌ వర్కర్స్‌కు వేశారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అయిన మెడికల్‌ స్టాఫ్‌కు టీకా వేసేందుకు ఎంపిక చేయగా 72.2శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌కు ముందుకొచ్చారు.2355మందికిటీకా వేసేందుకు ఏర్పాట్లు చేయగా 1702మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకున్నారు.అయితే తొలిరోజు టీకా వేసుకున్నవారిలో ఎవరికీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తొలిరోజు కేంద్రానికి వందమంది చొప్పున 29కేంద్రాల్లో  2900 మందికి టీకా వేయాలని అధికారులు నిర్ణయించినా.. ఆన్‌లైన్‌లో పేర్లు సరిగా నమోదుకాని కారణంగా 2355 మందికే టీకా వేసేందుకు అనుమతి వచ్చింది. వారిలోనూ 653మంది టీకా వేసుకునేందుకు ముందుకు రాలేదు.వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్న వైద్యులకు  ఫోన్లు చేసినా, తాము సంక్రాంతి సెలవులో ఉన్నామని కొందరు, వరుస పండుగలకు ఊరికి వచ్చామని మరికొందరు చెప్పి తప్పించుకోవడం విశేషం.ఈ విషయమై రుయాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు డాక్టర్లు భయపడుతున్నారని, కొందరు పండగలకు ఊర్లకు వెళ్లడంతో హాజరు కాలేకపోయారని, వారికి మరోసారి కౌన్సిలింగ్‌ ఇచ్చి వ్యాక్సిన్‌ ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా టీకా వేసుకునేందుకు ఆరోగ్యసిబ్బందే ముందుకు రాకుంటే సాధారణ ప్రజలు ఎలా వస్తారని భావించిన అధికారులు.. వెనకడుగు వేసిన 653మందికి ప్రస్తుతానికి టీకా వేయకూడదని భావిస్తున్నారు. టీకా కార్యక్రమం చివర్లో వీరికి టీకా వేసేలా నిర్ణయించారు. ఉదయం టిఫిన్‌ చేయకపోవడంతో నగరిలో ఓ మహిళకు వ్యాక్సినేషన్‌ తర్వాత కాస్త మగత వచ్చింది. ఇది మినహా జిల్లాలో మరెక్కడా ఎవరికీ ఇబ్బంది కలగలేదు.డీఎంహెచ్‌వో పెంచలయ్య మాట్లాడుతూ జిల్లాకు 42 వేల కొవి షీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వచ్చాయన్నారు. మొదటి దశలో 20 వేల మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు. వీరికే 28 రోజుల తరువాత రెండవ సారి డోస్‌ ఇస్తామన్నారు. ఇది కాకుండా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ మరో 60 వేల మంది జిల్లాలో ఉన్నారని, వారికి రెండవ దశలో వ్యాక్సిన్‌ ఇచ్చాక, ఆపై 50 ఏళ్లు పైబడిన వారికి, బీపీ, షుగర్‌ ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు.వ్యాక్సిన్‌ వేసుకునేందుకు మొదట్లో కాస్త భయం ఉన్నమాట వాస్తవమే అని, అయితే ఎవరికీ ఎలాంటి  రియాక్షన్‌ రాలేదని గుర్తించాలన్నారు. 


డిప్యూటి సీఎం నారాయణస్వామి కార్వేటినరగం ఆస్పత్రితో పాటు తిరుపతి రుయాస్పత్రిలో  వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రారంభించగా..మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు ప్రారంభించారు. మంగళం పీహెచ్‌సీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూధన్‌రెడ్డి, నగరిలో ఆర్‌కే రోజా, మదనపల్లెలో నవాజ్‌బాషా, చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు, ఐరాలలో ఎమ్మెస్‌ బాబు వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రారంభించారు. స్విమ్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కొండేయులు, జేసీ వీరబ్రహ్మం, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, డీఎంహెచ్‌వో పెంచలయ్య, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


స్విమ్స్‌లో అత్యధిక టీకాలు:

మొత్తం 29 కేంద్రాలకు గానూ స్విమ్స్‌లో వందమందికి టీకాలు వేశారు. ఆ తర్వాత అత్యధికంగా ఐరాల, శ్రీకాళహస్తిల్లో 86 చొప్పున, బంగారుపాళ్యం మండలం తుంబకుప్పంలో 82, భాకరాపేట, గంగవరం కేంద్రాల్లో 76 చొప్పున, గుడుపల్లెలో 73, నారాయణవనంలో 71మందికి వ్యాక్సిన్‌ వేశారు. చిత్తూరులోని అపోలో మెడికల్‌ కాలేజీలో మరీ తక్కువగా 8 మందికే టీకా వేశారు.


మరో 24 కరోనా కేసులు

తిరుపతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం మరో 24మందికి కరోనా వైరస్‌ సోకింది.తిరుపతి నగరంలో 11, తిరుపతి రూరల్‌, పుంగనూరు మండలాల్లో 2 చొప్పున, కుప్పం, పీలేరు, పుత్తూరు, రేణిగుంట, శ్రీకాళహస్తి మండలాల్లో ఒక్కొక్కటి వంతున వీటిలో వున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం  కేసుల సంఖ్య 89409కి చేరుకుంది.శనివారం ఉదయం 9 గంటల సమయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 158 వున్నాయి. 



టీకా వేసుకున్నాక ధైర్యమొచ్చింది

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పని చేస్తూ కరోనా బారిన పడ్డా. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. మరోసారి దాని బారిన పడకూడదని వ్యాక్సిన్‌ వేసుకున్నా.ముందు కొద్దిగా టెన్షన్‌ ఫీలయినా వ్యాక్సిన్‌ వేసుకున్నాక ధైర్యం వచ్చింది. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలంతా ధైర్యంగా ముందుకు రావాలి. 

-- నాగలక్ష్మి, స్టాఫ్‌ నర్సు 

Updated Date - 2021-01-17T07:01:02+05:30 IST