పంద్రాగస్టు నుంచి తొలిమెట్టు కార్యక్రమం

ABN , First Publish Date - 2022-07-27T06:57:49+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ‘తొలిమెట్టు’ పేరుతో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. ఆగస్టు 15 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ కార్యక్రమంలో మౌలిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పంద్రాగస్టు నుంచి తొలిమెట్టు కార్యక్రమం

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమం

జిల్లాలో ప్రారంభమైన శిక్షణా తరగతులు

ఆగస్టు 11 వరకు ఉపాధ్యాయులకు శిక్షణ

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 26: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ‘తొలిమెట్టు’ పేరుతో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. ఆగస్టు 15 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ కార్యక్రమంలో మౌలిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో విద్యార్థుల సామర్థ్యాలు సన్నగిల్లినట్లు తేలడం, కనీస పరిజ్ఞానం కన్నా తక్కువ ఉన్నారని గుర్తించడంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్‌ అధికారులకు రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిమెట్టు పేరుతో విద్యాశాఖ ఆగస్టు 15న మౌలిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధన (ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమరసీ-ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

ఫ విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపే లక్ష్యం

తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సొంతంగా చదవడం, రాయడం నేర్పించనున్నారు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు, పూర్ణసంఖ్య భావనలు, అకారాలు- పరిణామాలు, కొలతలు, దత్తాంశం తదితర గణింతాలంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు 1వ తరగతిలో నిమిషానికి 20 పదాలను, 2వ తరగతిలో 25 పదానాలు, 3వ తరగతిలో 30 పదాలను, 4వ తరగతిలో 40 పదాలను, 5వ తరగతిలో 50 పదాలను దారాళంగా చదవాల్సి ఉంటుంది. 3, 4, 5 తరగతుల్లోని విద్యార్థులు ఇచ్చిన పేరాను/గేయాన్ని/పద్యాన్ని చదివి అర్థం చే సుకోగలగాలి. 1వ తరగతి విద్యార్థులు సరళపదాలు, గుణింత పదాలు, 2వ తరగతి విద్యార్థులు ఒత్తుల పదాలు, 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 4 లేదా 5 పదాల్లో కనీసం 4 పదాలను తప్పుల్లేకుండా రాయల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు మండల రిసొర్స్‌ పర్సన్స్‌, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.

ఫ ఆగస్టు 15న ప్రారంభం

విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నహాలు చేస్తుంది. సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ, విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఫ 140 రోజుల పాటు కార్యక్రమం

2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజుల పనిదినాలు ఉండగా 140 రోజులు బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. వారానికి 6 రోజులు పని దినాలు ఉంటే 5 రోజులు బోధనాభ్యాస ప్రక్రియ నిర్వహణ కోసం 1 రోజు మూల్యాంకనం, పునరభ్యాసం కోసం కేటాయించారు. విద్యార్థులంతా భాగస్వాములు అయ్యేలా వార్షిక, పాఠ్య/వారపు, రోజువారి కాలాంశం లేదా పీరియడ్‌ ప్రణాళిక రూపొందించనున్నారు.

ఫ జిల్లాలో 3వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ

తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 3వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి మండలంలో ఇంగ్లిష్‌, తెలుగు, గణిత, పరిసరాల విజ్ఞానం నాలుగు సబ్జెక్టులకు కొత్తగా మండల రిసొర్స్‌ పర్సన్‌లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం నాగారంలోని డైట్‌ కళాశాలలో 3 రోజుల పాటు సాగే శిక్షణ తరగతులను డీఈవో దుర్గాప్రసాద్‌ ప్రారంభించారు. ఈ ఎంఆర్‌సీ ఈ నెల 30 నుంచి ఆగస్టు 11 వరకు ఆయా మండలాల్లో ఉపాధ్యాయులు సంఖ్యను బట్టి శిక్షణ ఇచ్చేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకే.. 

ఫ దుర్గాప్రసాద్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రాథమిక పాఠశాల్లో చదువుతున్న వి ద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకే విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది.  జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆగస్టు 11లోగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం. 

3వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ 

ఫ నర్ర రామారావు, ప్రొగ్రాం కొఆర్డినేటర్‌

జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 3వేల మంది ఉపాధ్యాయులకు శిక్ష ణ ఇవ్వనున్నాం. జూలై 26, 27, 28 తేదీ ల్లో మండల రిసొర్స్‌ పర్సన్‌లకు శిక్షణ ఇవ్వనున్నాం. ఆగస్టు 11లోగా మండలాల్లో ఉపాధ్యాయుల సంఖ్యనుబట్టి రిసొర్స్‌ పర్సన్‌లు ప్రతిరోజూ 50 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-07-27T06:57:49+05:30 IST