May 7 2021 @ 00:18AM

బాలీవుడ్‌లో తొలి అడుగులు!

ఎప్పటిలానే ఈ ఏడాది కొత్త నటీన టులు బాలీవుడ్‌ వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సినీ నేపథ ్యం వల్ల వీరిలో కొందరు నటీనటులు తొలి చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొత్త ముఖమే అయినా వారు నటించే సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తున్నారు. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న కొత్త హీరోలు, హీరోయిన్ల విశేషాలు. 


సంయోగితగా మానుషి చిల్లర్‌

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ పీరియాడికల్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’తో బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమౌతున్నారు. ఈ చిత్రంలో ఆమె అక్షయ్‌కుమార్‌ సరసన నటిస్తున్నారు. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ప్రియురాలు, మహారాణి సంయోగిత పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. 


కట్రీనా సోదరి ఇసబెల్లా కైఫ్‌ 

కట్రీనా కైఫ్‌ సోదరి ఇసబెల్లా కైఫ్‌ హిందీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారంటూ కొన్నేళ్లుగా వినిపిస్తున్నా ఈ ఏడాదే అవి కార్యరూపం దాల్చాయి. ‘క్వాత్‌’ చిత్రంతో ఈ ఏడాదే ఆమె బాలీవుడ్‌ చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె ఆయుష్‌ శర్మ సరసన కథానాయికగా నటిస్తున్నారు. మరో రెండు చిత్రాలను ఇసబెల్లా అంగీకరించారు. 


పాలక్‌ తివారి

బాలీవుడ్‌ నటి శ్వేతా తివారి తనయ పాలక్‌ తివారి ‘రోజీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో పాలక్‌ తివారి కనిపించనున్నారు. 


సూపర్‌ హీరోగా అహాన్‌ పాండే

అనన్యా పాండే సోదరుడు అహాన్‌ పాండే సూపర్‌ హీరోగా ఈ ఏడాదే బాలీవుడ్‌ తెరపైకి అడుగుపెడుతున్నారు. అజయ్‌ దేవగణ్‌  విలన్‌ పాత్రలో తెరకెక్కుతోన్న సూపర్‌ హీరో చిత్రంతో ఆయన కథానాయకుడుగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి శివ్‌ రవాయిల్‌ దర్శకుడు. 


ఆర్‌ఎక్స్‌ 100 రీమేక్‌తో అహాన్‌ శెట్టి 

నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. 2018లో వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ తెలుగు చిత్రం రీమేక్‌ ‘తడప్‌’తో ఆయన కథానాయకుడుగా పరిచయమవుతున్నారు. అహాన్‌ సరసన తారా సుతారియా కథానాయికగా నటిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌ వాలా, సల్మాన్‌ఖాన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ 24న ‘తడప్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


బ్యాడ్‌బాయ్‌గా నమషి చక్రవర్తి 

సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి ‘బ్యాడ్‌బాయ్‌’తో బాలీవుడ్‌ ప్రవేశం చేయబోతున్నారు. రాజ్‌కుమార్‌ సంతోషి ఈ చిత్రానికి దర్శకుడు. దీంతోపాటు మరో చిత్రం కూడా నమషి అంగీకరించాడు. బాలీవుడ్‌ విలన్‌ డానీ డెన్జోంగ్పా తనయుడు రింజింగ్‌ డెన్జోంగ్పా ‘స్క్వాడ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు రాజేష్‌ రోషన్‌ తనయ పష్మినా రోషన్‌ బాలీవుడ్‌ అరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.


బుల్లి తెర నుంచి బాలీవుడ్‌కు

బుల్లితెర, ఓటీటీ వెబ్‌సిరీస్‌ల్లో నటించటం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొందరు నటీనటులు ఈ ఏడాది బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేడే’. ఈ చిత్రంతో ప్రముఖ యూట్యూబర్‌ అజేయ్‌ నాగర్‌ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ‘అదూరి కహానీ హమారి’, ‘ప్యార్‌ తూనే క్యా కియా’ లాంటి పలు టీవీ సీరియళ్లలో నటించి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు లక్ష్య. ఆమె ‘దోస్తానా 2’ చిత్రంలో బాలీవుడ్‌లో తొలి అడుగులు వేయబోతున్నారు. అలాగే  టీవీ నటి క్రిస్టల్‌ డిసౌజా, ‘ద ఫర్‌ గాటన్‌ ఆర్మీ ఆజాదీ కేలియే’ వెబ్‌సిరీస్‌తో గుర్తుంపు దక్కించుకున్న శార్వరీ ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ చిత్రంతో అరంగేట్రం చేయనున్నారు.