స్టార్లు లేని భారత్‌కు కివీస్‌ పరీక్ష!

ABN , First Publish Date - 2021-11-25T07:59:05+05:30 IST

అజింక్యా రహానె సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టుకు స్వదేశంలో వరల్డ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ రూపంలో కఠిన సవాల్‌ ఎదురుకానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో గట్టిపోటీనిచ్చే కివీస్‌తో టీమిండియా తలపడనుంది.

స్టార్లు లేని భారత్‌కు కివీస్‌ పరీక్ష!

  • రహానెపైనే అందరి దృష్టీ 
  • శ్రేయాస్‌ అరంగేట్రం ఖాయమే
  • నేటి నుంచి తొలి టెస్ట్‌ 
  • ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో


కాన్పూర్‌: అజింక్యా రహానె సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టుకు స్వదేశంలో వరల్డ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ రూపంలో కఠిన సవాల్‌ ఎదురుకానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో గట్టిపోటీనిచ్చే కివీస్‌తో టీమిండియా తలపడనుంది. కెరీర్‌ చరమాంకంలో ఉన్న రహానె.. టీమిండియాకు సారథ్యం వహించడం బహుశా ఇదే చివరిసారి కావచ్చు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ రూపంలో గట్టిపోటీ ఎదుర్కొంటున్న వంద టెస్ట్‌ల వెటరన్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. మిడిలా ర్డర్‌లో చోటుకోసం సూర్యకుమార్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ మధ్య పోటీ నెలకొన్నా.. అయ్యర్‌ అరంగేట్రం ఖరారైంది. కోహ్లీ, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ గైర్హాజరీలో టీమిండియా బ్యాటింగ్‌ కొంత బలహీనంగా కనిపిస్తోంది. రహానె, పుజార, మయాంక్‌ అగర్వాల్‌కు మాత్రమే 10 టెస్టులకు పైగా ఆడిన అనుభవం ఉంది. కానీ, వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో బెంచ్‌ బలాన్ని పరీక్షించేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఇదో మంచి అవకాశం. 


ఓపెనర్లుగా మయాంక్‌, గిల్‌: ఓపెనర్లుగా మయాంక్‌, శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగనున్నారు. అగర్వాల్‌ ఆకట్టుకొనే ప్రదర్శన చేస్తే.. గాయంతో ఈ టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌కు మున్ముందు ఓపెనర్‌గా ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఓపెనర్‌గా అవకాశం లేకపోతే.. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించడానికి మేనేజ్‌మెంట్‌ ఆసక్తి చూపొచ్చు. ఇక, కోహ్లీ గైర్హాజరీలో జట్టును నడిపిస్తున్న రహానె.. గత 11 టెస్ట్‌ల్లో 19.57 సగటుతో 372 పరుగులే చేశాడు. నెట్‌ సెషన్స్‌లో కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సౌథీ, వాగ్నర్‌ లాంటి బౌలర్లను రహానె సమర్థంగా ఎదుర్కోగలిగితే.. మరికొన్ని రోజులు టీమ్‌లో ఢోకా ఉండకపోవచ్చు. లయను అందుకోలేకపోతున్న ఇషాంత్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. సిరాజ్‌ను పక్కనబెడితేనే లంబూకు చాన్స్‌. కొత్తబంతితో బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉమేష్‌ యాదవ్‌కు ఎక్కువగా ఉన్నాయి.


పూర్వవైభవం కోసం పోరాడుతున్న స్పిన్నర్‌ అశ్విన్‌, జడేజాపై ఎంతో భారం నెలకొంది. మరోవైపు కెప్టెన్‌ విలియమ్సన్‌ అందుబాటులోకి రావడంతో కివీస్‌ ఆత్మవిశ్వాసం పెరిగింది. అనుభవజ్ఞుడైన రాస్‌ టేలర్‌తోపాటు లాథమ్‌, నికోల్స్‌తో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ బలంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం అని భావిస్తున్న నేపథ్యంలో సోమర్‌ విల్లేతోపాటు ఎజాజ్‌ పటేల్‌పై విలియమ్సన్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మొత్తంగా స్పిన్‌ మంత్రం పఠిస్తున్న టాప్‌-2 టెస్టు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా సాగనుంది. 



జట్లు (అంచనా)

భారత్‌: మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజార, రహానె (కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, జడేజా, వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌/జయంత్‌ యాదవ్‌, ఉమేష్‌ యాదవ్‌, సిరాజ్‌/ఇషాంత్‌. 

న్యూజిలాండ్‌: టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, నికోల్స్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), శాంట్నర్‌/కైల్‌ జేమిసన్‌, సౌథీ, వాగ్నర్‌, సోమర్‌ విల్లే, ఎజాజ్‌ పటేల్‌. 


 పిచ్‌

వికెట్‌ మందకొడిగా ఉండి.. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించినా ఆశ్చర్యంలేదు. చివరిసారి కివీ్‌సతో ఇక్కడ ఆడిన టెస్ట్‌లో అశ్విన్‌, జడేజాలు మొత్తం 16 వికెట్లు పడగొట్టారు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప దృష్ట్యా సొంతగడ్డపై లభించే అదనపు ప్రయోజనాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు రహానె చెప్పాడు. కాగా, రెండో రోజు నుంచి స్పిన్‌కు సహకారం లభించవచ్చని క్యూరేటర్‌ తెలిపాడు. 




2 భారత్‌లో ఆడిన 34 టెస్ట్‌ల్లో న్యూజిలాండ్‌ రెండేసార్లు గెలిచింది. 1969లో నాగ్‌పూర్‌, 1988లో ముంబైలో నెగ్గింది. 


4 భారత పర్యటనలో కివీస్‌ ఎక్కువగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టేడియంగా గ్రీన్‌పార్క్‌. కాగా ముంబై, హైదరాబాదుల్లో ఐదేసి, చెన్నైలో నాలుగు టెస్ట్‌లు ఆడినా.. వేదికలు మారాయి. 


4 స్వదేశంలో టెస్ట్‌ల్లో వంద వికెట్లు సాధించిన పేసర్ల క్లబ్‌లో చేరేందుకు ఉమేష్‌ యాదవ్‌ నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. 


5 టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌గా నిలవడానికి అశ్విన్‌ (413) ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో417 వికెట్లతో హర్భజన్‌ సింగ్‌ టాప్‌లో కొనసాగతున్నాడు. 

Updated Date - 2021-11-25T07:59:05+05:30 IST