Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : మారుతున్న రాజకీయ పరిణామాలు.. సందిగ్ధంలో TRS.. ఏళ్లుగా వేచిన తరుణం!!

  • జిల్లాల వారీగానా, గ్రేటర్‌ మొత్తానికి ఒకటేనా?
  • సందిగ్ధంలో టీఆర్‌ఎస్‌  
  • ఏళ్లుగా.. వేచిన తరుణం 
  • పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు

మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పుడూ లేని విధంగా బస్తీ, కాలనీ, వార్డు, జిల్లా స్థాయి కమిటీలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం.. టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయిలో కమిటీలు వేయాలనుకోవడం ఇదే ప్రథమం. జిల్లాల్లో గ్రామ, మండల కమిటీల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌కు సంబంధించి జిల్లాల వారీగా కమిటీలు వేయాలా, గ్రేటర్‌ మొత్తానికి ఒకే కమిటీనా అన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కమిటీల నియామకం ఎలా ఉండాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 డివిజన్లున్నాయి. మహేశ్వరం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గాల్లో కొంత ఏరియా గ్రేటర్‌ ఆవల ఉంటుంది. పునర్విభజనతో జిల్లాల విస్తీర్ణం భారీగా తగ్గింది. నగరం చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలు పలు కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రస్తుతమున్న మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల విస్తీర్ణం తగ్గింది. ఇందులో కొన్ని ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా, మరి కొన్ని అవతల ఉన్నాయి. గ్రేటర్‌ కమిటీ నియమించిన పక్షంలో ఆయా జిల్లాల కమిటీ పరిధి గణనీయంగా తగ్గే అవకాశముంది.


అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండే శివారు డివిజన్ల నేతలకు పొరుగు జిల్లా కమిటీల్లో చోటు దక్కితే ఇబ్బందికరమే అన్న అభిప్రాయాన్ని కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నియామకానికి సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నగరంలో భారీ కార్యక్రమం నిర్వహించాలంటే గ్రేటర్‌ కమిటీ ఉంటేనే జన సమీకరణకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీ పరిధి వరకు కమిటీ నియమించవచ్చని కొందరు చెబుతుండగా, జిల్లాల వారీగా కమిటీ ఏర్పాటుకూ అవకాశం లేకపోలేదని మరి కొందరంటున్నారు. గ్రేటర్‌ కమిటీ ఏర్పాటు చేసిన పక్షంలో మహానగరమంతటా పరిచయాలు ఉన్న, వివాదరహితంగా ఉండే వ్యక్తికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు బస్తీ, కాలనీ, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, ఆ లోపు జిల్లాల వారీగా కమిటీలు ఉండాలా, గ్రేటర్‌ మొత్తానికా అన్న దానిపై స్పష్టత రావచ్చని ఓ నాయకుడు తెలిపారు.

ఏదీ అవకాశం..? 

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలో భారీ సంఖ్యలో నేతలు చేరారు. ఎమ్మెల్యేలతోపాటు, శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిన నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి నాయకులు కారెక్కారు. ఐదారేళ్లయినా ఇప్పటికీ తగిన గుర్తింపు లేదన్న ఆవేదన చాలా మందిలో ఉంది. నామినేటెడ్‌ పోస్టులు, పార్టీ పదవులు దక్కుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నేతలూ నగరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిటీల కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం దక్కిందన్న అపవాదు ఉంది. దీంతో ఉద్యమకారులకు నామినేటెడ్‌ పోస్టులు, కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ‘పదవులు వదులుకొని వచ్చాం.. తగిన గుర్తింపు లేకుంటే ఎలా’ అని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement