చేపలు తిందాం.. ఆరోగ్యంగా ఉందాం!

ABN , First Publish Date - 2021-07-30T04:25:30+05:30 IST

జిల్లాలో మంచినీరు, ఉప్పునీటి సాగు చెరువులతోపాటు కనిగిరి, సోమశిల, కండలేరు, నెల్లూరు, సర్వేపల్లి, గండిపాళెం వంటి రిజర్వాయర్లు, చెరువులు ఇలా మొత్తం దాదాపు 70వేల హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది.

చేపలు తిందాం..  ఆరోగ్యంగా ఉందాం!

వినియోగం పెంపుపై కేంద్రం దృష్టి

ఆక్వా హబ్బుల ఏర్పాటుకు శ్రీకారం

పీఎంఎంఎస్‌వై ద్వారా సబ్సిడీలు

ఇప్పటికే 521 దరఖాస్తులకు కలెక్టర్‌ ఆమోదం


ఒక వ్యక్తి ఏడాదికి సుమారు 7 కేజీల వరకు చేపలను ఆహారంగా తీసుకుంటాడు. అదే ఇతర దేశాల్లో సుమారు 22 కేజీల వరకు ఉంటుంది. మనిషిలో రోగ నిరోధకశక్తితోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే చేపల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకానికి శ్రీకారం చుట్టింది. మత్స్యకార రంగాన్ని మరింత అభివృద్ధి చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు, ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం.


నెల్లూరు (వ్యవసాయం), జూలై 26 : 

జిల్లాలో మంచినీరు, ఉప్పునీటి సాగు చెరువులతోపాటు కనిగిరి, సోమశిల, కండలేరు, నెల్లూరు, సర్వేపల్లి, గండిపాళెం వంటి రిజర్వాయర్లు, చెరువులు ఇలా మొత్తం దాదాపు 70వేల హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. జిల్లాలో గండి, బొచ్చ, కొరమేను, మోసు ప్రధానంగా సాగు చేస్తుంటారు. పీఎంఎంఎస్‌వై పథకం  ద్వారా 40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ లభించనుంది.  ఇందుకోసం ఆక్వా హబ్బుల ఏర్పాటుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా హబ్బుల్లో  ప్రజలకు అవసరమైన చేపలను లైవ్‌గా, శుభ్రం చేసి, రెడీమేడ్‌ రూపంలో అందుబాటులో ఉంచుతారు. అంతేగాక చేపల పెంపకానికి అవసరమైన అధునాతన పరికరాలను అందించడం, ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహకారం అందించనుంది.


దరఖాస్తులకు కలెక్టర్‌ ఆమోదం


పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆనలైన ద్వారా దరఖాస్తు చేసుకున్న దాదాపు 521 దరఖాస్తులకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆమోదించారు. ఏప్రిల్‌ నెలాఖరుకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసినా ఔత్సాహికుల కోసం ఇప్పటికీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. చేపలను అమ్ముకునేందుకు మత్స్యకార సొసైటీలు కలిసి ఆక్వా హబ్బులు (మార్కెట్‌) ఏర్పాటుకు రూ.కోటి సబ్సిడీ ఇస్తోంది. రెడీమేడ్‌ ఫుడ్‌ అమ్మకాలకు అధునాత వసతులు కల్పించేందుకు రూ.50లక్షల సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో ఉప్పునీటి చేపల చెరువుల నిర్మాణానికి 4 యనిట్లు కేటాయింపులు జరిగాయి. ఒక్కో యూనిట్‌కు రూ.18లక్షలు కేటాయించగా జనరల్‌ కోటాలో 40శాతం సబ్సిడీతో 2, అదేవిధంగా జనరల్‌ మహిళకు, ఎస్టీ కోటా కింద ఒక్కో యూనిట్‌కు 60శాతం సబ్సిడీ లభించనుంది. రిజర్వాయర్లలో చేపల పెంపకానికి 300 యూనిట్లు కేటాయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.3లక్షల వరకు సబ్సిడీ అందనుంది. అదేవిధంగా సముద్రపు నీటిలో పంజరంలో చేపల పెంపకానికి 90 యూనిట్లు కేటాయించగా ఒక్కో యూనిట్‌కు రూ.5లక్షల వరకు సబ్సిడీ, మంచినీటి చెరువుల నిర్మాణానికి 2యూనిట్లకు గాను జనరల్‌, ఎస్సీలకు కేటాయించారు. లైవ్‌ ఫిష్‌ అమ్ముకునేందుకు రవాణాకు అవసరమైన వాహనాలు, చేపలు పట్టుకునేందుకు అవసరమైన బోట్లు ఇలా ఎన్నో సదుపాయాలను సబ్సిడీ రూపంలో అందించనున్నారు.


దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం


పీఎంఎంఎస్‌వై పథకం కింద ఆనలైన ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వివిధ యూనిట్లకు సంబంధించి 521 దరఖాస్తులకు కలెక్టర్‌ ఆమోదించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలకు రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ మత్స్య సహాయకులను సంప్రదించాలి.

- నాగేశ్వరరావు, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌

Updated Date - 2021-07-30T04:25:30+05:30 IST