జాలర్లపై సముద్రపు దొంగల దాడి

ABN , First Publish Date - 2022-01-25T14:42:37+05:30 IST

రాష్ట్ర జాలరులపై ఇప్పటి వరకూ శ్రీలంక నావికాదళం చేసిన పనిని ఇప్పుడా దేశ సముద్రపు దొంగలు చేపట్టి నట్లుంది. ఇన్నాళ్లూ లంక నావికాదళం దాడులకు దిగగా, ఇప్పుడా దేశ దోపిడీ దారులు పూనుకున్నారు. పొట్టకూటి

జాలర్లపై సముద్రపు దొంగల దాడి

- లక్షల విలువైన వస్తువుల చోరీ

- ముగ్గురికి తీవ్రగాయాలు

- దోపిడీదారులు లంకవాసులని అనుమానం


చెన్నై: రాష్ట్ర జాలరులపై ఇప్పటి వరకూ శ్రీలంక నావికాదళం చేసిన పనిని ఇప్పుడా దేశ సముద్రపు దొంగలు చేపట్టి నట్లుంది. ఇన్నాళ్లూ లంక నావికాదళం దాడులకు దిగగా, ఇప్పుడా దేశ దోపిడీ దారులు పూనుకున్నారు. పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన రాష్ట్ర జాలర్లపై దాడి చేయడంతో పాటు వారి వద్ద వున్న లక్షలాది రూపాయల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నాగపట్టినం జిల్లా వేదారణ్యం సమీపంలో జరిగిన ఈ వ్యవహారం రాష్ట్ర సముద్రతీర ప్రాంతాల్లో ఉద్రిక్తత రేపుతోంది. వివరాలిలా వున్నాయి... పుష్పవనం ప్రాంతానికి చెందిన నాగముత్తు (44), పన్నీర్‌సెల్వం (48), రాజేంద్రన్‌ (54) సోమవారం వేకువ జామున ఫైబర్‌ పడవలో వేదారణ్యానికి ఆగ్నేయ దిశగా చేపలవేటకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సముద్రపుదొంగలు తమిళ జాలర్లపై ఇనుపకమ్మీలతో దాడి చేశారు. ముగ్గురిని పడవ నుంచి సముద్రంలోకి నెట్టేశారు. అనంతరం ఆ పడవను తీసుకుని శ్రీలంక వైపు పరారయ్యారు. ఆ పడవలో 200 కేజీల వలలు, జీపీఎస్‌ పరికరాలు, వాకీటాకీలు, సెల్‌ఫోన్లు డీజిల్‌ క్యాన్లు వున్నాయి. సముద్రపు దొంగల దాడిలో గాయపడిన జాలర్లను గమనించిన రాష్ట్ర జాలర్లు వారిని ఆర్కాటు తీరానికి చేర్చి స్థానికుల సాయంతో వేదారణ్యం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై వేదారణ్యం సముద్రతీర భద్రతాదళానికి చెందిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా దాడి చేసిన వారు సింహళ మాట్లాడుతున్నారని, వారు శ్రీలంక వాసులేనని బాధితులు పేర్కొన్నారు. ఇదిలా వుండగా రాష్ట్ర జాలర్లపై జరిగిన దాడి పట్ల జాలరి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-25T14:42:37+05:30 IST