’భరోసా’ భోక్తలపై విచారణకు ఆదేశం

ABN , First Publish Date - 2021-06-14T06:01:33+05:30 IST

మత్స్యకార భరోసా కుంభకోణంపై విచారణకు మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

’భరోసా’ భోక్తలపై విచారణకు ఆదేశం
నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌

స్వయానా ఎంపీనే కమిషనర్‌కు ఫిర్యాదు

రూ.1.65 కోట్ల కుంభకోణం జరిగిందని అనుమానం

మత్స్యశాఖ జేడీకి విచారణ బాధ్యతలు అప్పగించిన కమిషనర్‌

తెనాలి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మత్స్యకార భరోసా కుంభకోణంపై విచారణకు మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్వయానా ప్రస్తుత అధికార పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కూడా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మత్స్యకార భరోసాకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కుంభకోణం జరిగిందని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన కమిషర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఒక్క నిజాంపట్నం మండలంలోనే రూ.1.65 కోట్ల వరకు భరోసా సొమ్ము అక్రమార్కులకు చేరినట్టు ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చినట్టు తెలిసింది. అటు బాపట్ల వ్యవహారంపై మాత్రం ఇంకా ఎవరూ దృష్టిపెట్టలేదు. దీనిపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. అయితే నిజాంపట్నం మండలంలో జరిగిన కుంభకోణంపై స్వయంగా విచారణ జరిపి, వారంలోగా నివేదిక ఇవ్వాలని మత్స్యశాఖ అదనపు డైరెక్టర్‌ అంజలి పేరుతో గుంటూరు మత్స్యశాఖ జేడీకి ఆదేశాలు అందాయి. మొదట లబ్దిదారుల అర్హతపై పరిశీలన జరిపి, తర్వాత కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ అయితే, దీనికి వెనుక ఎవరున్నారనే దానిపై దృష్టి పెట్టనున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో కాకుండా, నిజాంపట్నంలోనే ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని దానిలో లబ్ధిదారుల చేర్పుల వంటి దొంగ ప్రక్రియను కొనసాగించినట్టు చెబుతున్నారు. అయితే నిజంగా మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిలో కొందరికి పెన్షన్‌ వస్తుందని, మరికొందరికి ప్రభుత్వ పరంగా ఇతర లబ్ది చేకూరుతుందనే కారణాలతో ముందుగానే కొంతమంది అర్హుల పేర్లు తొలగించారని, అయితే వారి స్థానంలో అసలు మత్స్యకార వృత్తితో సంబంధంలేని, ఇతర వర్గాలకు చెందినవారి పేర్లు చేర్చరనేది సమాచారం. చివరకు ఆలయ పూజారి పేరునుకూడా దీనికి వాడుకున్నట్టు బయటకు వచ్చింది. మొదట 980కిపైగా పేర్లు చేర్చేందుకు రంగం సిద్ధం చేసిన అక్రమార్కులు చివరకు 540 పేర్లతో సరిపెట్టి ఆ మొత్తాన్ని, మరికొన్ని చోట్ల ఇతర రూపాలలో కుంభకోణాలకు పాల్పడ్డట్టు చెబుతున్నారు. అయితే జిల్లా మత్స్యశాఖ అధికారులు జరిపే విచారణలో ఎంతవరకు అక్రమార్కులు బయటపడతారో చూడాల్సిందే. అయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరిని మాత్రం తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2021-06-14T06:01:33+05:30 IST