Abn logo
Sep 27 2021 @ 00:13AM

మత్స్యకారులూ.. అప్రమత్తంగా ఉండండి

పరిశీలిస్తున్న డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

సముద్రతీర గ్రామాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ 

పోలాకి/నరసన్నపేట: తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. ఆదివారం పోలాకి మండలం సముద్రతీర గ్రామాలైన గుప్పెడుపేట, రాజారాంపురం, కొత్త రేపు, గుల్లవానిపేట, సుసరాం తదితర గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సముద్రంలో పోటు పెరిగిందని అందుకు మత్య్సకారులకు ఆర్థికంగా ఆదుకునేందకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార పదార్థాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తీరం దాటే సమయంలో భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున బయట తిరగవద్దని సూచించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, రెండు మండలాల అధికారులు పాల్గొన్నారు. 

 

అధికారులు సిద్ధంగా ఉండాలి

 ఫోన్‌లో కలెక్టర్‌కు మంత్రి అప్పలరాజు  సూచన

పలాస: పలాస-టెక్కలి నియోజకవర్గాల మధ్య తుఫాన్‌ తీరందాటే ప్రమాదముందని, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కోరారు. ఈ మేరకు రెండు నియోజకవర్గాల్లో ప్రజాప్రతి నిధులతో ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్‌తో తుఫాన్‌పై సమీక్షించారు. తుఫాన్‌ ప్రభావిత మండలాల్లో తహసీల్దార్లకు అప్రమత్తం చేయాలని, కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం, సహాయం అందించాలని కోరారు.  అధికారులంతా క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని, వ్యవసాయా ధికారులు రైతులకు సూచనలు చేయాలని తెలిపారు. పంట నష్టం జరిగితే తక్షణమే నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, తుఫాన్‌ అనంతరం పరిస్థితిపై సమీక్షించేందకు ప్రణాళికతో సిద్ధం కావాలని ఆయన కోరారు.


=====


  తుఫాన్‌ ప్రభావంపై  అచ్చెన్న ఆరా!

 టెక్కలి/టెక్కలి రూరల్‌: గులాబ్‌ తుఫాన్‌ ప్రభా వంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌తో టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు. తుఫాన్‌ ప్రభావం జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు, వర్షాలు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. అలాగే వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు డా.కిల్లి కృపారాణి తుఫాన్‌ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు.