సముద్రంలో వేటకు తాత్కాలిక విరామం

ABN , First Publish Date - 2022-01-24T06:43:31+05:30 IST

కడలిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు విరామం ప్రకటించారు.

సముద్రంలో వేటకు తాత్కాలిక విరామం

నరసాపురం, జనవరి 23: కడలిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు విరామం ప్రకటించారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తుపా న్లు కారణంగా సముద్రంలో వేటకు అనుకూల పరిస్థితులు ఉండవు.  అయితే గత డిసెంబరు నుంచి సముద్రంలో గాలి దిశ మారింది. దీనికి తోడు నీరు కూడా రంగు మారడంతో వేటాడినా మత్స్య సంపద దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా సముద్రంలో వారం రోజులు ఉన్నా కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది మత్స్యకారులు బోట్లను కట్టేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. నరసాపురం తీరంలో 300 నుంచి 400 బోట్లు వరకు వేట సాగిస్తుంటాయి. స్థానిక బోట్లే కాకుండా తూర్పు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ఇక్కడ వేటాడేందుకు వస్తుంటారు. గోదావరి సుముద్రంలో కలిసే ప్రదేశం కావడంతో ఇక్కడ అపార మత్స్య సంపద దొరుకుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రొయ్య, పండుగొప్ప, టోనా వంటి చేపలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. అయితే ప్రస్తుతం సీజన్‌ అయినప్పటికీ సముద్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వేటకు విరామం ప్రకటించారు. దీనివల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. 


Updated Date - 2022-01-24T06:43:31+05:30 IST