అంతా పాత కథే!

ABN , First Publish Date - 2020-11-22T08:08:48+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. వాటికోసం రూ.వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ హార్బర్ల

అంతా పాత కథే!

ఫిషింగ్‌ హార్బర్ల ప్రతిపాదనలు ఏళ్ల నాటివి 

ఇప్పుడు కొత్తగా అంచనాలు పెంచి కలరింగ్‌ 

ఒక్కో హార్బర్‌ నిర్మాణ వ్యయం 350 కోట్లు 

ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు 

నిజాంపట్నానికి 451 కోట్లకు, ఉప్పాడకు 

422 కోట్లకు పెంచి పరిపాలనా ఆమోదం 

జువ్వలదిన్నె హార్బర్‌ అంచనా రూ.కోటి పెంపు

రివర్స్‌ టెండరింగ్‌ ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. వాటికోసం రూ.వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ హార్బర్ల ప్రతిపాదనలు ఏళ్ల తరబడి సాగుతున్నవే. అయితే ప్రస్తుతం వాటికి అంచనాలు పెంచేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంట్రాక్టుల అంచనాలపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని, బోలెడు ప్రజాధనం ఆదా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... వీటి విషయంలోకి వచ్చేసరికి ఆ ఊసెత్తకపోగా గతంలో వేసిన అంచనాలనే పెంచేసింది. సముద్ర తీరప్రాంతంలో మత్స్యకారుల కోసం జువ్వెలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, పూడిమడక, బుడగట్లపాలెం, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నంలలో ఫిషింగ్‌ హార్బర్లు (జెట్టీలు) ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వంలోనూ అప్పటి అంచనాలతో కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ కేంద్రం నుంచి నిధులు రాక ముందుకు సాగలేదు.


ప్రస్తుత ప్రభుత్వం ఎనిమిది హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. వీటికి సీఎం జగన్‌ శనివారం శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.1,510కోట్లతో నాలుగు హార్బర్లను నిర్మిస్తామని, వచ్చేనెల 15 లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్మాణ వ్యయంలో 50శాతం కేంద్రం భరిస్తుంౄదని, మిగిలిన మొత్తానికి నాబార్డు వంటి సంస్థల ఆర్థికసాయం తీసుకొని వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒక్కో హార్బర్‌ నిర్మాణ వ్యయం రూ.350 కోట్లుగా అధికారులు ప్రతిపాదించగా, ధరల వ్యత్యాసం పేరుతో అంచనాలు పెంచారు. నిజాంపట్నం హార్బరుకు పాత అంచనా వ్యయం రూ.379.17 కాగా, ఇప్పుడు దాన్ని రూ.451 కోట్లకు పెంచారు. అలాగే ఉప్పాడ హార్బరుకు గతంలో వేసిన అంచనా రూ.350.44 అయితే ప్రస్తుతం రూ.422కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చారు. మచిలీపట్నం హార్బర్‌కు ఇంతకుముందు రూ.285.60కోట్లు అంచనా వేయగా ఇప్పుడు రూ.348కోట్లుగా నిర్ధారించారు. జువ్వలదిన్నె హార్బర్‌కు ప్రస్తుతం రూ.289కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు.


గత ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్‌ నిర్మాణానికి అనుమతిచ్చారు. అప్పుడు దాని అంచనా వ్యయం రూ.288కోట్లు మాత్రమే. ఇందులో కేంద్రం రూ.144కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.144 కోట్లు భరించాలని నిర్ణయించాయి. ఆ మేరకు 2019 మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం దీని అంచనా వ్యయాన్ని కేవలం రూ.కోటి పెంచారు. ఈ నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు రూ.1,457కోట్లకు సాంకేతిక అనుమతులివ్వగా, కాంట్రాక్టు విలువ అంచనా మాత్రం రూ.1,206 కోట్లే చూపుతున్నారు. కాగా, వీటికి ఈ నెల 7న టెండర్లు పిలవగా, వచ్చే నెల 14న ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-11-22T08:08:48+05:30 IST