‘భరోసా’ తక్కువ.. ప్రచారం ఎక్కువ

ABN , First Publish Date - 2021-05-19T09:18:43+05:30 IST

మత్స్యకార భరోసా పేరుతో మత్స్యకారులకు ఇచ్చినదాని కంటే ఆ పేరుతో ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఎక్కువగా ఉందని మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు...

‘భరోసా’ తక్కువ.. ప్రచారం ఎక్కువ

  • మత్య్సకారులను వంచించిన ప్రభుత్వం: కొల్లు 

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): మత్స్యకార భరోసా పేరుతో మత్స్యకారులకు ఇచ్చినదాని కంటే ఆ పేరుతో ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఎక్కువగా ఉందని మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా సాధారణంగా ఇచ్చే భృతినే ఏదో కొత్తగా చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోందన్నారు. ‘టీడీపీ హయాంలో మత్స్యకారులకు వలలు, పడవలు, ఐస్‌బాక్స్‌లు వంటి పరికరాలు కొన్ని ఉచితంగా, కొన్ని సబ్సిడీతో ఇచ్చాం. ఈ ప్రభుత్వం వాటన్నిటినీ నిలిపివేసి రూ. పది వేలతో సర్దుకోవాలని చెబుతోంది. కార్పొరేషన్‌ రుణాలు, ఫెడరేషన్‌ గ్రూప్‌ రుణాలు నిలిపివేశారు. ఈ రెండేళ్లలో వాటిని ఎందరికి ఇచ్చారో దమ్ముంటే చెప్పాలి. ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తుల ఎగుమతులను మణిపూర్‌ వంటి రాష్ట్రాలు నిషేధిస్తే కనీసం వారితో సంప్రదింపులు కూడా జరపలేకపోయారు. ఇళ్ల పట్టాల పేరుతో మత్స్యకారులకు చెందిన వేలాది ఎకరాల భూములను లాక్కొన్నారు. మడ అడవులను నరికివేసి ఉపాధిని దెబ్బకొట్టారు. చీరాల ప్రాంతంలో రాజకీయ ఆధిపత్యం కోసం మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టిన వారిపై చర్యలు తీసుకోలేకపోయారు. చివరకు వారికి దక్కాల్సిన రిజర్వాయర్లలో చేపలు పట్టే హక్కులను కూడా డబ్బుల కోసం అమ్ముకొన్నారు. చేపల వేటకు వెళ్లి శ్రీలంక, పాక్‌ సైన్యం చేతిలో చిక్కుకొన్న వారిని చంద్రబాబు, రామ్మోహన్‌నాయుడు విడిపించారు తప్ప వారి గురించి జగన్‌రెడ్డి కనీసం పట్టించుకొన్న పాపాన పోలేదు’ అని కొల్లు రవీంద్ర విమర్శించారు. 


Updated Date - 2021-05-19T09:18:43+05:30 IST