సమీపిస్తున్న సంధికాలం

ABN , First Publish Date - 2021-04-14T06:35:37+05:30 IST

సంధి కాలం సమీపించింది. సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి నేపఽథ్యంలో ఏటా వేట విరామం ప్రకటిస్తారు.

సమీపిస్తున్న సంధికాలం

రేపటి నుంచి సముద్ర జలాల్లో వేటకు విరామం

జూన్‌ 14 వరకూ కొనసాగనున్న నిషిద్ధం

కర్ర తెప్పలకు మినహాయింపు

ముందస్తుగా సంధికాలపు భత్యం, సొమ్ము ఇవ్వాలంటున్న మత్స్యకారులు

బోట్లు, వలల మరమ్మతులను ఉపాధి హామీ పనుల్లో చేర్చాలని వినతి

చీరాల, ఏప్రిల్‌ 13 : సంధి కాలం సమీపించింది. సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి నేపఽథ్యంలో ఏటా వేట విరామం ప్రకటిస్తారు. అందులోభాగంగా ఈనెల 15వ తేదీ నుంచి జూన్‌ 14 వరకూ సంధికాలంగా మత్స్యశాఖ ప్రకటించింది. ఆ సమయంలో సముద్రంలో వేట నిషిద్ధం. అయితే సంప్రదాయ కర్రతెప్పలతో వేటాడే వారికి మాత్రం  మినహాయింపు ఉంటుంది. సంధికాలపు భత్యం సొమ్ము రూ.10వేలు అర్హులందరి ఖాతాలో ముందస్తుగా జమ చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కరుణించాలని కడలిపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పాటు వలలు, బోట్లు మరమ్మతు పనులను ఉపాధి పనుల్లో చేర్చాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నామని, కనీసం ఈ ఏడాదన్నా తమ విన్నపాన్ని అమలుచేయాలని కోరుతున్నారు.


సంధికాలం సంకటమే

జిల్లాలో 102 కిలోమీటర్ల తీరప్రాం తంలో 74 మత్స్యకార గ్రామాలు ఉన్నా యి. ఆ పరిఽధిలో 42 మెకనైజ్డ్‌ బోట్లు, 1,800 మోటరైజ్డ్‌ బోట్లతో పాటు 2వేల వరకు సంప్రదాయ బోట్ల ద్వారా మత్స్యకారులు వేటసాగిస్తున్నారు. సంధికాలం వారికి సంకటం. ఆ క్రమంలో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుంది. సంధికాలం రెండు నెలలకు రూ.10వేలు నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అయితే ఆ భత్యం ఇవ్వడంలో ప్రతిసారీ ప్రభుత్వం జాప్యం చేస్తూనే ఉంది.


ఇంకా కొందరికి అందని గతేడాది భత్యం

గతేడాది లబ్ధిదారుల్లో కొందరికి ఇప్పటికి భత్యపు సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు.  బడ్జెట్‌ రాలేదు, రాగానే మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే ఆ సొమ్ము జమచేయాలని మత్య్సకారులు కోరుతున్నారు. లబ్ధిదారులను ఆఽధార్‌, రేషన్‌కార్డుల ప్రాతిపదికన ఎంపికచేస్తారు. అయితే కొందరికి రేషన్‌కార్డులు లేవు. ఈ నేపథ్యంలో తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ భత్యపు సొమ్ము ఇవ్వాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2021-04-14T06:35:37+05:30 IST