Abn logo
May 10 2021 @ 08:48AM

కరోనా భయం... ఫిట్‌నెస్‌‌తో అభయం

  • క్లాస్‌లు మళ్లీ ప్రారంభం 
  • గతేడాది అనుభవాలతో ముందే మేలుకున్న ఫిట్‌నెస్‌ ప్రియులు, ట్రైనర్లు
  • యోగా నుంచి హిట్‌, పిలాట్స్‌ వరకూ ప్రాక్టీస్‌ చేస్తున్న నగరవాసులు

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ కాలమిది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడంతో పాటు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామాలు చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. జిమ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే భయాలతో ఫిట్‌నెస్‌ ప్రియులు వాటికి దూరంగా ఉండటంతో ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మొదలు పెట్టారు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ సమయంలో అక్కరకు వచ్చిన ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ క్లాస్‌లు ఇప్పుడు తిరిగొచ్చాయి. అలాగని జిమ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు ఏమీ మూతపడలేదు. కానీ చాలా వరకూ ఫిట్‌నెస్‌ ప్రియులు  వాటికి దూరంగానే ఉంటూనే తమ ఫిట్‌నెస్‌ అవసరాలనూ తీర్చుకుంటున్నారు. వర్చ్యువల్‌ గ్రూప్‌ తరగతులు, లైవ్‌ సెషన్స్‌ ఇప్పుడు నగరంలో  ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ యోగా, జూమ్‌ జుంబా, ఫేస్‌బుక్‌ పిలాట్స్‌, యూట్యూబ్‌ హిట్‌... రూపం ఏదైనా ఫిట్‌నెస్‌ మంత్రంగా ఆన్‌లైన్‌ తరగతులు ఎక్కువగానే జరుగుతున్నాయి.


కరోనా భయాన్ని తరిమేయండిలా..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌ మాత్రం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. దీనికోసమే యూట్యూబ్‌లు తోపాటు తమ రెగ్యులర్‌ శిక్షకులతోనూ టచ్‌లో ఉంటున్నారు. ఇదే విషయమై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రఘు మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆన్‌లైన్‌ అన్నారు. కానీ తర్వాత కాలంలో చాలామంది స్టూడియోకు వచ్చేవారు. ఎప్పుడైతే సెకండ్‌ వేవ్‌ ఉధృతమైందో ఫిట్‌నెస్‌ ప్రియులు మళ్లీ ఆన్‌లైన్‌ మార్గం పట్టారు. ఆఫ్‌లైన్‌లో సౌకర్యం ఆన్‌లైన్‌లో ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆన్‌లైన్‌ తప్పదు.

ఆన్‌లైన్‌ గ్రూప్‌ క్లాస్‌లు, లైవ్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నా’ అన్నారు. ఆన్‌లైన్‌ గ్రూప్‌ ఫిట్‌నెస్‌ తరగతులు జూమ్‌, గుగూల్‌ డ్యుయో, ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌, ఫేస్‌బుక్‌లైవ్‌ లాంటి వాటి ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. చేయాలనుకున్న వ్యాయామాలు ఇంట్లోనే చేయొచ్చు. యోగా, హిట్‌, పిలాట్స్‌ లాంటివి ట్రై చేయొచ్చు. వీటికి భారీ ఎక్వి్‌పమెంట్‌ కూడా అవసరం లేదంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. రోజువారీ కార్యక్రమాలలో యోగాను భాగంగా చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చంటూ చాలామంది యోగా క్లాస్‌లకు హాజరవుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రాణాయామం లాంటి తరగతులకు ప్రస్తుతం డిమాండ్‌ ఉందంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. గత లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌లు చేసుకున్నారు కానీ ఈసారి అలాంటివేవీ పెద్దగా కనబడటం లేదు. ఫిట్‌నెస్‌ పట్ల ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కరికీ కనబడుతోంది అని అంటున్నారు శిక్షకులు.

సౌకర్యం... భద్రత...

మహమ్మారి ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలనూ ఏకం చేసింది. వాకర్స్‌ మొదలు జిమ్‌ గోయర్స్‌ వరకూ, ఫిట్‌నెస్‌ ప్రియులు మొదలు యోగా అభ్యాసకుల వరకూ ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ ద్వారా ఫిట్‌నెస్‌ రొటీన్‌ నేర్చుకుంటున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ తరగతులతో అన్నీ చేయలేము కానీ కొన్ని రకాల వ్యాయామాలు మాత్రం సౌకర్యవంతంగా ఇంటిలో చేసుకోవచ్చు. తానైతే యోగా, జుంబా క్లాస్‌లకు హాజరవుతున్నానన్నారు సోషలైట్‌ కవిత. ఆన్‌లైన్‌ క్లాస్‌లతో బయటకు వెళ్లే బాధ తప్పుతుంది. కానీ యోగాలాంటివి సరైన పోశ్చర్‌లో ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం కష్టమే అని అంటున్నారు మరో ఫిట్‌నెస్‌ ప్రియుడు వెంకట్‌. 


ముఖాముఖి లైవ్‌ సెషన్‌లలో అయితే కొంత మేర సరిచేయవచ్చేమో కానీ గ్రూప్‌ సెషన్‌లలో మాత్రం అది కష్టమే అని అన్నారు. 

అయితే ఫిట్‌నెస్‌ శిక్షకుల మాట మాత్రం వేరేగా ఉంది. అనువు కాని చోట అధికులమనకూడదు. మరీ ముఖ్యంగా కరోనా ముంగిట! కొన్నాళ్ల పాటు స్టూడియోలు, జిమ్‌లలో కష్టమే. కానీ ఆసక్తిని చంపుకోలేని వారికి ఆన్‌లైన్‌ తరగతులు. గ్రూప్‌ సెషన్స్‌తో అన్నీ చేయలేం కానీ తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి మాత్రం సహాయపడుతుంది ఆన్‌లైన్‌. కార్డియో, తబాటా, ఏరోబిక్స్‌ లాంటి వ్యాయామాలు నేర్చుకోవడానికి ఇది ఉత్తమమార్గంగా నిలుస్తుంది అని అంటున్నారు. ఇదే విషయమై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరీష్‌ మాట్లాడుతూ ‘మనం ఎక్కడ ఉన్నా క్లాస్‌ తీసుకోవచ్చు. మరీ వందల మందికి ఒకేసారి క్లాస్‌ ఇవ్వడం కాకుండా 5 నుంచి 10 మందికి క్లాస్‌ ఇస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు’ అని చెప్పుకొచ్చారు.