పురాతన నాణెల పేరుతో మోసగించిన ఐదుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T05:09:12+05:30 IST

శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణెం ఇస్తామని నమ్మించి గిరిజన మహిళను మోసగించి రూ. ఆరు లక్షలు కాజేసిన ఐదుగురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక డీఎస్పీ డాక్టర్‌ వీబీ.రాజ్‌కమల్‌ తెలిపారు.

పురాతన నాణెల పేరుతో మోసగించిన ఐదుగురి అరెస్టు
డీఎస్పీ రాజ్‌కమల్‌



రూ. ఆరు లక్షలు స్వాధీనం

పాడేరు డీఎస్పీ వీబీ.రాజ్‌కమల్‌


పాడేరురూరల్‌, మే 10: శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణెం ఇస్తామని నమ్మించి గిరిజన మహిళను మోసగించి రూ. ఆరు లక్షలు కాజేసిన ఐదుగురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక డీఎస్పీ డాక్టర్‌ వీబీ.రాజ్‌కమల్‌ తెలిపారు. ఈనెల 9వ తేదీ ఆదివారం వర్తన లక్ష్మి అనే మహిళకు శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణెం ఇస్తామని, వంతాడపల్లి చెక్‌గేటు వద్దకు డబ్బులతో రావాలని సమాచారం ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆదివారం ఉదయం 10 గంటలకు కారులో వచ్చి ఆమె వద్ద ఉన్న రూ.ఆరు లక్షలను భయపెట్టి, బెదిరించి కాజేసిన తర్వాత ప్లాస్టర్‌తో చుట్టిన కొబ్బరిబొండాన్ని ఆమె చేతిలో పెట్టి పరారయ్యారన్నారు. నాణెం పేరుతో తనను మోసగించిన విషయాన్ని గుర్తించిన లక్ష్మి స్థానిక పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ పి.పైడిపునాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారన్నారు. ఈ నేపఽథ్యంలో అదేరోజు సాయంత్రం చింతలవీధి సమీపంలో ఉన్న గ్రౌండ్‌లో నిందితులు నగదును పంచుకుంటున్నట్టు అందిన సమాచారం మేరకు సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బందితో దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారినుంచి రూ.ఆరు లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన వారిలో నలుగురు అరకులోయ మండలం చినలబుడుకు చెందిన వారు కాగా మరొక వ్యక్తి పాడేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. పట్టుబడిన నిందితులు గతంలో గంజాయి వ్యాపారం చేసేవారని, లాక్‌డౌన్‌ కారణంగా నాణెల పేరుతో అమాయకులను మోసగిస్తున్నారన్నారు. ఈ ముఠాకు చెందిన వారు మరికొంత మంది ఉన్నట్టు గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బంది జగన్నాథం, వెంకటరావు, గణేశ్‌, లక్ష్మణ్‌, శ్రీనును అభినందించారు.

Updated Date - 2021-05-11T05:09:12+05:30 IST