విశాఖలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్..!

ABN , First Publish Date - 2020-05-29T18:04:54+05:30 IST

విశాఖ శివారులోని మధురవాడ పరిధి పోతినమల్లయ్యపాలెం ప్రాంతంలో గలగాయత్రీనగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

విశాఖలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్..!

మధురవాడ ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌

ఇటీవల వైరస్‌ బారినపడిన ప్రైవేటు వైద్యుడి కాంటాక్టుగా గుర్తింపు

వైద్యుడి ఆస్పత్రిలో మెడికల్‌ షాపు సూపర్‌వైజర్‌గా విధులు

అతని ద్వారా కుటుంబంలో నలుగురికి వైరస్‌

మరో యువకుడు కూడా ఆస్పత్రి కాంటాక్టే...

బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నం


విశాఖపట్టణం (ఆంధ్రజ్యోతి): విశాఖ శివారులోని మధురవాడ పరిధి పోతినమల్లయ్యపాలెం ప్రాంతంలో గలగాయత్రీనగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ ఆస్పత్రి వైద్యునికి కొద్దిరోజుల కిందట పాజిటివ్‌ వచ్చింది. తరువాత ఆయన భర్య కూడా వైరస్‌ బారినపడ్డారు. దీంతో సదరు వైద్యుడి కుటుంబ సభ్యులు, ఆయనతో సన్నిహితంగా వున్న వారికి, ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మెడికల్‌ షాపు సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులైన భార్య (32), తండ్రి (60), ఏడు, ఎనిమిదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు వ్యక్తి నివాసం వుంటున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకుని పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయించారు. ఈ అపార్ట్‌మెంట్‌ చుట్టూ 200 మీటర్ల పరిధిని అధికారులు రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. గాయత్రీనగర్‌కు వెళ్లే మార్గాలను మూసివేయడంతోపాటు జీవీఎంసీ జోన్‌-1 కమిషనర్‌ రాము ఆధ్వర్యంలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లను బృందాలుగా ఏర్పాటుచేసి, ఆయా ప్రాంతాల్లో సర్వే ఇంటింటా చేయించారు. వైరస్‌ బారినపడిన కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన 21 మందిని గుర్తించి క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. జీవీఎంసీ సీఎంహెచ్‌వో డాక్టర్‌ శాస్ర్తి, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ జయరాంతోపాటు, పీఎం పాలెం సీఐ రవికుమార్‌ ఇతర అధికారులు గాయత్రీ నగర్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 


మహారాణిపేటలో యువకుడికి కరోనా 

మహారాణిపేట 29వ వార్డు ఆంధోనీనగర్‌ ప్రాంతంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల మహారాణిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యుడు, అతని భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న యువకుడికీ పాజిటివ్‌గా తేలింది. గత మూడు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో పరీక్షలు చేయించుకోగా, యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికీ పాజిటివ్‌ వచ్చే అవకాశం వుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. కాగా యువకుడి కుటుంబ సభ్యులు, అతడు గత కొద్దిరోజులుగా కలిసిన వారికి కూడా పరీక్షలు చేయనున్నారు. యువకుడి నివాసం తదితర ప్రాంతాల్లో గురువారం వైద్య సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు.


540 మందికి నెగెటివ్‌.. 

కరోనా అనుమానిత లక్షణాలు వున్న వ్యక్తులకు నిర్వహించిన పరీక్షల్లో  గురువారం 540 మందికి నెగెటివ్‌ రాగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. మరో 896 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. రెండు ఐసోలేషన్‌ ఆస్పత్రుల్లో 37 మంది, జిల్లాలోని పలు ప్రాంతాలలో వున్న 70 క్వారంటైన్‌ కేంద్రాల్లో 533 మంది ఉన్నారు. వైరస్‌ బారినపడి, గీతం కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న నలుగురిని గురువారం డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2020-05-29T18:04:54+05:30 IST