Abn logo
Sep 26 2020 @ 03:48AM

ఐదు దశాబ్దాల అనుబంధం

Kaakateeya

బాలు.. ఇళయరాజా..


కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాక- బాలూ ! త్వరగా కోలుకుని మళ్లీ రా..! అని మొట్టమొదట వీడియో పోస్టు పెట్టిన వ్యక్తి.. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా. పరిశ్రమకొచ్చిన తొలినాళ్లలో అనుబంధం గురించి ఇళయరాజా ఆ పోస్టులో గుర్తుకుతెచ్చుకున్నారు. ఇద్దరిదీ ఐదు దశాబ్దాల స్నేహం. కుటుంబ స్నేహితులు. వీరిద్దరిదీ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అన్నది అందరికీ తెలిసిందే. తొలినాళ్లలో బాలూ సంగీత దర్శకుడిగా ఉన్నపుడు ఆయన ఆర్కెస్ట్రాలో ఇళయరాజా కూడా పనిచేశారు.


ఇళయరాజా --బాలూ కలిసి అనేక లైవ్‌ కన్సర్ట్స్‌ చేశారు. తెలుగుతోసహా దక్షిణ భారత సినీ సంగీతంలో కొత్త ఆర్కెస్ట్రైజేషన్‌కు తెరలేపిన మహా సంగీత జ్ఞాని ఇళయరాజా. వీరి కాంబినేషన్‌ అద్భుత ప్రయోగాలకు నాంది పలుకుతుందని, సినీ సంగీతాన్నే మలుపు తిప్పుతుందని వారికి ఆనాడు తెలియదు. విశేషమేమంటే  పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చిన తొలినాళ్లలో బాలూ చేత ఇళయ రాజా పాడించలేదు. ‘రోజుకి 12 గంటలకు పైగా పనిచేస్తూ వందల పాటలు పాడుతున్నావ్‌.. ఆరోగ్యం జాగ్రత్త..!’ అని బాలుని ఇళయరాజా హెచ్చరించారు.


కానీ బాలూ వినలేదు. ఊహించినట్లే   గొంతులో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఆ సమయంలో ఇళయరాజా- మలేసియా వాసుదేవన్‌తో    చాలా పాటలు పాడించి బాలును పక్కన పెట్టారు. ఇన్‌ఫెక్షన్‌ తగ్గాక బాలూయే అడిగారు. ‘‘నేను కూడా గాయకుడినే కదా, నా చేత ఎందుకు పాడించవు’’ అని అడిగారు. దానికి ఆయన నవ్వి ‘‘నా మాట నువ్వు వినలేదు. ఇన్‌ఫెక్షన్‌ తెచ్చుకున్నావు. అయినా ఇప్పుడేం కొంప మునిగిందని..రేపు ఉదయం రా.. పాట పాడుదువు గాని’’ అని చెప్పి అవకాశం ఇచ్చారు. అది మొదలు, ఆయనకు బాలూయే ప్రధాన గాయకుడయ్యారు. సుమారు రెండున్నర వేల పాటలు వారిద్దరి కాంబోలో వచ్చాయి.

పొరపొచ్చాలు..

అంతటి గాఢ స్నేహం ఉన్న ఇద్దరిమధ్యా కూడా పొరపొచ్చాలు వచ్చాయి. రెండేళ్ల కిందట ఎస్పీబీ -50 ఏళ్ల సంగీత యాత్ర పేరిట ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేస్తున్న సమయంలో ఇళయరాజా ఆయనకు ఓ లీగల్‌ నోటీసు పంపారు. ‘‘మీరు నేను కంపోజ్‌ చేసిన పాటలు పాడడానికి వీల్లేదు.. ఎందుకంటే ఆ పాటల మీద నాకు కూడా రాయల్టీ రావాలి’’ అన్నది దాని సారాంశం. కనీసం మాటమాత్రంగానైనా ముందుగా చెప్పకుండా ఈ నోటీసివ్వడం దారుణమని బాలూ ఆవేదన చెందారు.


తన ఆప్తమిత్రుడే లీగల్‌ నోటీసు పంపడంపై ఆయన చాలా బాధపడ్డారు. ఏమీ మాట్లాడకుండా- ఆయన కోరినట్లే ఆయన పాటలు పాడడం ఆపేశారు. ఇది సంగీతాభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఎందుకంటే ఇళయరాజా కాంబోలో అనేక సూపర్‌హిట్‌ పాటలున్నాయి. కొద్ది నెలల పాటు ఈ అంతరం కొనసాగింది. ఆ తరువాత కొందరు మధ్యవర్తుల చొరవతో బాలూ - ఇళయరాజాకు రాయల్టీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement