ఐదు జిల్లాల్లో కట్టడే కీలకం!

ABN , First Publish Date - 2020-03-29T10:01:26+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 14 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ప్రధానంగా అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర దేశాలకు, ఉత్తర

ఐదు జిల్లాల్లో కట్టడే కీలకం!

  • కేసులన్నీ  హైదరాబాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి, కరీంనగర్‌, కొత్తగూడెం జిల్లాల్లోనే 
  • మిగతా జిల్లాలకు పాకకుండా జాగ్రత్తలు
  • శంషాబాద్‌, కోకాపేటల్లో 2,400 మంది క్వారంటైన్‌

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 14 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ప్రధానంగా అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర దేశాలకు, ఉత్తర భారతానికి వెళ్లి వస్తున్న వారితోనే వ్యాధి వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే వ్యాధి బయటక పడటంలేదు. అప్పటికే వారు కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, బయటి ప్రదేశాల్లోని జనంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలడంతో వారు కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


హైదరాబాద్‌, కరీంనగర్‌, భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి.. ఈ 5 జిల్లాలోనే కరోనా కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాల్లో ఒక్క కేసు కూడా బయటప డలేదు. రాష్ట్రంలో మొత్తం 67 పాజిటివ్‌ కేసులు తేలాయి. 6కేసులు మినహా మిగిలినవన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే బయటపడ్డాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంది. అత్యధిక జనాభా ఇక్కడే ఉంది. ముఖ్యంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి వస్తున్న వారితో వ్యాధి విస్తరించింది. ఇప్పటికే శంషాబాద్‌, కోకాపేట తదితర ప్రాంతాల్లోని దాదాపు 2,400 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.


వైద్య బృందాలు, ఇతర శాఖల అధికారులు ఉదయం, సాయంత్రం ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌ పాటించని మరో 140 మందిని జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిని రాజేంద్రనగర్‌ సెంటర్‌లో ఉంచి, అబ్జర్వేషన్‌లో పెట్టారు. కోకాపేట ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ గేటెడ్‌ కమ్యూనిటీ పరిసరాలను దిగ్బంధం చేశారు. కిలోమీటరు మేర చుట్టుపక్కల ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. కరీంనగర్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందినవారు గల్ఫ్‌ దేశాల నుంచి రావడంతో అక్కడ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ 5 జిల్లాలను కట్టడి చేస్తే.. మిగతా జిల్లాలకు వైరస్‌ పాకకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి.


5 జిల్లాల్లోని అనుమానిత కేసులను క్వారంటైన్‌ చేయడంతో పాటు.. స్ర్కీనింగ్‌, వైద్య సదుపాయాలను మరింత పెంచాలని అంటున్నారు. వైద్య బృందాలు, పోలీసులను ఇక్కడే ఎక్కువగా నియమించేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు పాటిస్తున్న లాక్‌డౌన్‌ను మరింత తీవ్రతరం చేయాలని సూచిస్తున్నారు. ఈ జిల్లాలను కట్టడి చేస్తే.. మిగతా జిల్లాలైనా కనీసం భద్రంగా ఉంటాయని అంటున్నారు.

Updated Date - 2020-03-29T10:01:26+05:30 IST