అదిగదిగో.. 5జీ!

ABN , First Publish Date - 2022-01-25T07:59:21+05:30 IST

మొబైల్‌ ఇంటర్నెట్‌ డేటా వేగానికి మారుపేరైన 5జీ టెక్నాలజీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరికల్లా.. ప్రస్తుతమున్న డేటా స్పీడ్‌కు 100 రెట్ల వేగాన్ని భారత మొబైల్‌ యూజర్లు అందుకోనున్నారు....

అదిగదిగో.. 5జీ!

డిసెంబరుకల్లా విస్తరించనున్న ‘ఐదోతరం’ నెట్‌వర్క్‌ సేవలు

వెయ్యి నగరాల్లో రిలయెన్స్‌-జియో టెక్నాలజీ

ఏప్రిల్‌లో 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి అవకాశాలు

4జీ టెక్నాలజీ కంటే వంద రెట్లు ఎక్కువ వేగం

దేశంలో అదనంగా 8 లక్షల టవర్ల అవసరం

ఉన్న టవర్లకు ఫైబరైజేషన్‌తో అప్‌గ్రేడేషన్‌!

గేమింగ్‌, ఎడ్‌టెక్‌, ఫిన్‌టెక్‌కు డిమాండ్‌

ఈ రంగాల్లో కోటి మందికి ఉద్యోగాలు!

ఇప్పటికే 3 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు


మొబైల్‌ ఇంటర్నెట్‌ డేటా వేగానికి మారుపేరైన 5జీ టెక్నాలజీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరికల్లా.. ప్రస్తుతమున్న డేటా స్పీడ్‌కు 100 రెట్ల వేగాన్ని భారత మొబైల్‌ యూజర్లు అందుకోనున్నారు. మొబైల్‌ ఆపరేటర్ల మధ్య పోటీ నేపథ్యంలో.. ఆలోపే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ‘డిజిటల్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా వనరులను సమకూర్చే పనిలో పడింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ నెలలో ఆ తంతును ముగించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది చివరికల్లా వెయ్యి నగరాల్లో 5జీ సేవలను అందజేస్తామని జియో ఇప్పటికే ప్రకటించగా.. ఇతర ఆపరేటర్లు కూడా పోటీపడుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ఈ 5జీ టెక్నాలజీ ఆగమనంతో.. ప్రస్తుతం ఉన్న 50-100 ఎంబీపీఎస్‌ వేగం 1జీబీపీఎస్‌ కంటే ఎక్కువగా ఉంటుంది.


ఏమిటీ 5జీ టెక్నాలజీ?

ప్రస్తుతం మనం వినియోగిస్తున్న 4జీ టెక్నాలజీ తెలిసిందే. ప్రతి సెకనుకు 10ఎంబీ నుంచి 100 ఎంబీ వరకు డేటా డౌన్‌లోడ్‌ వెసులుబాటు ఉంది. 5జీ టెక్నాలజీ దీనికంటే 100 రెట్ల మేర అధిక వేగంతో పనిచేస్తుంది. అంటే.. తక్కువలతో తక్కువగా 1జీబీపీఎస్‌ వేగం ఉంటుంది. ఆ పరిధి 10 జీబీ దాకా పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. 700 ఎంబీ సైజులో ఉండే ఒక వీడియో ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడానికి ప్రస్తుతం 4జీలో నిమిషం వ్యవధి అవసరమైతే.. 5జీ టెక్నాలజీలో సెకనులోపే పనిపూర్తవుతుంది.  


వనరులు ఎలా?

5జీ సాంకేతికతకు వనరులు అంతకు ముందు తరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా అవసరం. అయితే.. అందుకు అయ్యే ఖర్చు మాత్రం చాలా తక్కువ. 2జీ, 3జీ, 4జీలతో పోలిస్తే.. 5జీలో సెల్‌ టవర్‌ పరిధి మరింతగా తగ్గుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్‌) ఇంజనీర్ల అంచనా ప్రకారం.. 200 మీటర్ల నుంచి 500 మీటర్లకు ఒక టవర్‌ ఇక్వి్‌పమెంట్‌ అవసరం. అయితే.. ప్రతి 200 కిలోమీటర్లకు టవర్లు ఉండవు. ప్రస్తుతం ఉన్న టవర్లకు అనుసంధానంగా.. విద్యుత్తు స్తంభాలకు గానీ, అపార్ట్‌మెంట్లపై గానీ 5జీ పరికరాలను బిగిస్తారు. ఈ పరికరాలు మనం ఇళ్లలో వినియోగించే వైఫై రోటర్ల వంటివే. ఒక విధంగా చెప్పాలంటే.. 5జీ నెట్‌వర్క్‌ అంటే వీధుల్లో అమర్చే పెద్ద వైఫై రోటర్లే..! 5జీలో ఒక్కో వీవోఎన్‌ఆర్‌ పరికరాన్ని అమర్చే ఖర్చు రూ.3 వేల లోపే ఉంటుందని అంచనా. మొబైల్‌ ఆపరేటర్లకు ఈ ఖర్చు తక్కువ మొత్తమే కావడం వల్ల.. డేటా చార్జీలు కూడా అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు కలుపుకొని 6.8 లక్షల సెల్‌ టవర్లు ఉన్నాయి. వాటికి మరో 8 లక్షల సెల్‌టవర్లను కొత్తగా ఏర్పాటు చేస్తే.. ప్రధాన నగరాలతోపాటు.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా 5జీ సేవలు విస్తరిస్తాయి.  ప్రస్తుతం ఉన్న 6.8 లక్షల మొబైల్‌ టవర్లలో 34ు మాత్రమే ఫైబర్‌ సదుపాయం కలిగి ఉన్నాయి. మిగతా వాటికి కూడా ఫైబరైజేషన్‌ పూర్తయితే.. అవి 5జీ సేవలకు సిద్ధమవుతాయి.


సిద్ధమవుతున్న మొబైల్‌ ఆపరేటర్లు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సెల్‌ సేవలు అందిస్తున్న మొబైల్‌ ఆపరేటర్లంతా 5జీ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో రిలయెన్స్‌-జియో కొంత ముందంజలో ఉంది. అందుక్కారణం.. ఆ సంస్థకు ఉన్న సెల్‌ టవర్లన్నీ 4జీ టెక్నాలజీకి సంబంధించినవే. కొద్దిపాటి మార్పులతో ఆ పరికరాలను 5జీకి మార్చవచ్చు. చాలా నగరాల్లో ఆ సంస్థ ఫైబర్‌ డేటా సేవలు అందజేస్తోంది. అంటే.. కాలనీల్లో 5జీని వేగంగా అమలు చేసేందుకు పెద్దగా అదనపు వనరుల అవసరం ఉండదు. ఈ ఏడాది వెయ్యి నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఇప్పటికే జియో ప్రకటించింది. ఆ దిశలో పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఎయిర్‌టెల్‌, వొడఫోన్‌ ఐడియా కూడా వేగంగా అప్‌గ్రేడ్‌కు సిద్ధమవుతూ.. ఈ ఏడాది చివరికల్లా ఆ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ కూడా 2016 నుంచే 5జీపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 5జీ విషయంలో సీరియ్‌సగా పనిచేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ‘టెస్ట్‌బెడ్‌’ పరీక్షలను నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ నెలలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. మొబైల్‌ ఆపరేటర్ల మధ్య పోటీ నేపథ్యంలో అనుకున్న సమయం(డిసెంబరు) కంటే ముందే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. 5జీ టెక్నాలజీ వస్తే..  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా అనాలటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌, ఆటోమేషన్‌, గేమింగ్‌, ఎడ్‌టెక్‌, ఫిన్‌టెక్‌, హెల్త్‌టెక్‌ విభాగాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఓ అంచనా ప్రకారం కోటి మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. 


గ్రామాలకు ఇప్పట్లో లేనట్లే

5జీ టెక్నాలజీ అంటే.. ఇళ్లలో ఉండే వైఫై రోటర్లు కొంత ఎక్కువ సామర్థ్యంతో వీధికి రెండుమూడు ఉన్నట్లే. వనరులకు ఖర్చు తక్కువే అయినా.. నగరాల ద్వారానే టెలికాం ఆపరేటర్లకు గిట్టుబాటు అవుతుంది. 500 మీటర్ల దూరాన్ని కవర్‌ చేసేలా.. రెండు 5జీ పరికరాలను అమరిస్తే.. నగరాల్లో 100-500 వినియోగించుకునే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అలా కాదు. ఆ పరిధికి అయిదారుగురే వినియోగదారులు ఉండే అవకాశాలున్నాయి. ఈ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే చాలా సమయం పట్టవచ్చు. అయితే.. టెలికాం ఆపరేటర్లు నగరాల్లోని తమ 4జీ పరికరాలను గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తే.. అక్కడ నెట్‌ స్పీడ్‌ ప్రస్తుతం ఉన్నదానికంటే పెరిగే అవకాశాలున్నాయి.

- నాగేంద్ర కుమార్‌ సుబుద్ధి, ఆర్‌ఎఫ్‌ ఇంజనీరు


2.89 కోట్ల మంది 5జీ ఫోన్లు కొనేశారు

కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అనే సంస్థ అంచనాల ప్రకారం.. 2021లో 16.9 కోట్ల మేర స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరిగాయి. 2020తో పోలిస్తే ఇది 11ు ఎక్కువ. 16.9 కోట్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 5జీ సేవలకు అనుకూలంగా ఉన్న వాటి సంఖ్య 2.89 కోట్లు(17ు)గా ఉందని కౌంటర్‌పాయింట్‌ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020తో పోలిస్తే.. ఇది ఆరు రెట్లు ఎక్కువ. అంటే.. 5జీ సేవలు రాకముందే.. ఆ సాంకేతికతను సపోర్ట్‌ చేసే ఫోన్లకు డిమాండ్‌ పెరిగిందని స్పష్టమవుతోంది.


వేర్వేరు జనరేషన్ల నెట్‌వర్క్‌ ఇలా

1జీ: ఈ సేవలు కేవలం అమెరికా సైన్యానికే పరిమితం అయ్యయి. సైన్యంలో కమ్యూనికేషన్‌కు ఇతోధికంగా ఉపయోగపడ్డాయి

2జీ:  1997లో భారత్‌లోకి ఈ టెక్నాలజీ ప్రవేశించింది. కేవలం ఫోన్‌కాల్‌ చేయడం, అందుకోవడానికే ఇది పరిమితమయ్యేది. ఆ తర్వాతి కాలంలో 2.5జీ టెక్నాలజీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది.  

3జీ: ఈ టెక్నాలజీలో యూనివర్సల్‌ మొబైల్‌ టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్‌(యూఎంటీఎస్‌) ద్వారా ఇంటర్నెట్‌ వేగం బ్రాడ్‌బ్యాండ్‌(సెకనుకు 256కేబీ కంటే ఎక్కువ) స్థాయికి పెరిగింది. టెలికాం ఆపరేటర్‌ ద్వారా వాయిస్‌ కాల్‌తో పాటు.. వీడియోకాలింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

4జీ: లాంగ్‌ టర్మ్‌ ఎవాల్యుయేషన్‌(ఎల్‌టీఈ), వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ(వీవోఎల్‌టీఈ) ద్వారా డేటా వేగం పెరిగింది. 10ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ మేర డౌన్‌లోడ్‌కు వెసులుబాటు కలిగింది. వీవోఎల్‌టీఈ టెక్నాలజీ ద్వారా వైఫై కాలింగ్‌తో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

5జీ: నిరంతరాయ డేటా, వాయిస్‌ సేవలు పొందవచ్చు. 4జీతో పోలిస్తే.. ఈ టెక్నాలజీలో డేటా వేగం 100 రెట్లు అధికంగా ఉంటుంది. 4జీలో ఎల్‌టీఈ మాదిరిగా.. 5జీలో వాయిస్‌ ఓవర్‌ నాన్‌-రేడియో(వీవోఎన్‌ఆర్‌) సేవలను వినియోగిస్తారు. 

Updated Date - 2022-01-25T07:59:21+05:30 IST