నిర్లక్ష్య డ్రైవింగ్‌ కేసుల్లో ఐదుగురికి బేడీలు

ABN , First Publish Date - 2022-01-19T15:42:43+05:30 IST

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు యువకులు శశాంక్‌శేఖర్‌, మబేందర్రాయ్‌, ఇందుకూరి శ్రీకాంత్‌ సాఫ్ట్‌వేర్‌..

నిర్లక్ష్య డ్రైవింగ్‌ కేసుల్లో ఐదుగురికి బేడీలు

మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు చేసి, ఇతరుల మృతికి కారణమైన వారిపై సైబరాబాద్‌ పోలీసులు కొరఢా ఝులిపించారు. మొత్తం ఐదుగురు నిందితులకు బేడీలు వేశారు. ఐపీసీ304 పార్టు-2 (కల్పబుల్‌ హోమిసైడ్‌ అమాంగ్‌ టుది మర్డర్‌) సెక్షన్‌ అమలు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.


హైదరాబాద్‌ సిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు యువకులు శశాంక్‌శేఖర్‌, మబేందర్రాయ్‌, ఇందుకూరి శ్రీకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. డిసెంబర్‌- 31న బాగా మద్యం సేవించారు. తెల్లవారుజామున గచ్చిబౌలి పరిధిలోని బొటానికల్‌ గార్డెన్‌ పాలపిట్ట సర్కిల్‌ మసీద్‌బండ వద్ద తాగిన మత్తులో స్విఫ్ట్‌ డిజైర్‌ కారుతో అతివేగంతో వెళ్తున్న నిందితులు సైకిలిస్టు నితిన్‌ అగర్వాల్‌ను బలంగా ఢీ కొట్టారు. దాంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను పట్టుకున్న పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా 186 పాయింట్లు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం తాగిన మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతో పాటు.. ఆ డ్రైవింగ్‌ను ప్రోత్సహించిన మిగిలిన ఇద్దరు స్నేహితులపై గచ్చిబౌలి పోలీసులు ఐపీసీ 304 పార్టు-2 అమలు చేసి కటకటాల్లోకి నెట్టారు. 


టిప్పర్‌ డ్రైవర్‌, ఓనర్‌కు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా టిప్పర్‌ నడిపి రోడ్డు ప్రమాదం చేసిన డ్రైవర్‌ను ఆ టిప్పర్‌ ఓనర్‌ను సైబరాబాద్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గాజులరామారానికి చెందిన ఒడ్డె రవీందర్‌ ఎలాంటి లైసెన్స్‌ లేకుండానే టిప్పర్‌ లారీని నడుపుతున్నాడు. అతనికి లైసెన్స్‌ లేదని తెలిసీ టిప్పర్‌ యజమాని కుంచపు వెంకటేష్‌.. రవీందర్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఈనెల-17న కూకట్‌పల్లి పరిధిలో జాతీయ రహదారి-65పైన పల్సర్‌ బైక్‌పై వెళ్తున్న నాగోల్‌కు చెందిన జగన్‌మోహన్‌రెడ్డిని ఢీ కొట్టాడు. ఈ  ప్రమాదంలో జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. రంగంలోకి దిగిన కేపీహెచ్‌బీ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. నిందితునికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో పాటు.. అది తెలిసీ టిప్పర్‌ డ్రైవర్‌గా నియమించుకున్నందుకు యజమానిపై ఐపీసీ 304 పార్టు-2 అమలు చేసి, ఇద్దరినీ కటకటాల్లోకి నెట్టారు.


ఐపీసీ సెక్షన్‌ 304 పార్టు-2 ప్రకారం.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు పోయేందుకు కారణమైనందుకు నిందితులకు పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉన్నట్లు డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. 

Updated Date - 2022-01-19T15:42:43+05:30 IST