ఐదుగురు జూనియర్‌ వైద్యుల్లో... కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో..

ABN , First Publish Date - 2020-04-02T09:22:20+05:30 IST

నగరంలోని ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో..

ఐదుగురు జూనియర్‌ వైద్యుల్లో... కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో..

నాలుగు రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని అధికారుల సూచన

అనంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

మరో ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు

కొద్దిరోజులుగా ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో సేవలు

తమ రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఐదుగురు జూనియర్‌ డాక్టర్లు (పీజీలు), ఇద్దరు స్టాఫ్‌ నర్సుల్లో వైరస్‌ లక్షణాలు కనిపించడంతో అధికారులు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన సుమారు 70 మంది అనుమానితులకు పరీక్షల నిర్వహణ, స్వాబ్‌ సేకరించిన సమయంలో పీజీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తెలిసింది. ఐదుగురు పీజీల్లో మంగళవారం రాత్రి లక్షణాలు కనిపించడంతో వారికి సెలవులు మంజూరుచేసిన అధికారులు నాలుగు రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌లో వుండాలని ఆదేశించారు.


అదేవిధంగా మరో ఇద్దరు స్టాఫ్‌ నర్సులు అనారోగ్యానికి గురికావడంతో ఐసోలేషన్‌ వార్డులోకి తరలించారు. మరో హెడ్‌ నర్సు కూడా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకేసారి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న సిబ్బంది అనారోగ్యం బారినపడడంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురైన ఐదుగురు స్టాఫ్‌ నర్సులకు పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 


రక్షణ పట్టదా?

ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ గురించి అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ బారినపడి ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య కొద్దిరోజులుగా పెరిగిందని, వీరందరికీ పరీక్షలు నిర్వహించే సమయంలో కనీసం ఎన్‌ 95 మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు  సమకూర్చకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కనీస సదుపాయాలను సమకూర్చకపోతే సిబ్బందే వైరస్‌ బారినపడే ప్రమాదం వున్నదని, దీనివల్ల బాధితులకు అందే సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అధికారులు ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్‌లు, ఎన్‌ 95 మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని జూనియర్‌ వైద్యుల అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-04-02T09:22:20+05:30 IST