బీహార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-01-27T16:46:04+05:30 IST

సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు...

బీహార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి

పట్నా: సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావ్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఐదుగురి మృతిపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటర జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు  నిర్ధారించారు.గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు.కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం నితీష్ కుమార్ పై విమర్శలకు దిగారు. 


మిత్రపక్షమైన బీజేపీ కూడా సీఎంపై ధ్వజమెత్తింది.మద్యనిషేధ చట్టం పూర్తిగా విఫలమైనందున దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు.మద్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయని అధికారులే డబ్బులు దండుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ అన్నారు.ఈ ఘటనల నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బీహార్‌లో కల్తీ మద్యం వల్ల మరణాలకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ కోరారు.


Updated Date - 2022-01-27T16:46:04+05:30 IST