కల్తీ మద్యం మాఫియాపై దర్యాప్తునకు సిట్

ABN , First Publish Date - 2022-01-20T12:57:52+05:30 IST

మండీ జిల్లా సుందర్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు...

కల్తీ మద్యం మాఫియాపై దర్యాప్తునకు సిట్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం మాఫియాపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సర్కారు నియమించింది. మండీ జిల్లా సుందర్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు.సుందర్‌నగర్‌లోని సలాపర్ ప్రాంతంలో చండీగఢ్‌కు చెందిన కంపెనీ తయారుచేసిన 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీని తాగి ఐదుగురు మరణించారు. మద్యం తాగిన వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని సుందర్‌నగర్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంmr వారిని నెర్‌చౌక్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. కల్తీ మద్యం తాగిన ఐదుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు.ఈ దుర్ఘటనకు కల్తీ మద్యం రవాణా చేస్తున్న మద్యం మాఫియా కారణమని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు, స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కల్తీ మద్యం మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కల్తీ మద్యం విక్రయించిన దుకాణానికి సీలు వేశామని, దీనికి కారణమైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మండీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాలిని అగ్నిహోత్రి చెప్పారు.


ఈ కేసును విచారించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్‌కు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజీ, సెంట్రల్ రేంజ్) మధుదూదన్ నేతృత్వం వహిస్తారు. ఈ దర్యాప్తు బృందంలో ఎస్పీ కాంగ్రా ఖుషాల్ చంద్ శర్మ, ఎస్పీ మండి షాలినీ అగ్నిహోత్రి, ఎస్పీ (క్రైమ్) సిఐడి సిమ్లా వీరేంద్ర కాలియా సభ్యులుగా ఉంటారు.సుందర్‌నగర్ ఎమ్మెల్యే రాకేష్ జమ్వాల్ మాట్లాడుతూ మృతుల బంధువులకు రూ. 8 లక్షల పరిహారం అందజేస్తామన్నారు.


Updated Date - 2022-01-20T12:57:52+05:30 IST