ఇరాన్‌ హిజాబ్‌ నిరసనల్లో.. ఐదుగురు మృతి?

ABN , First Publish Date - 2022-09-21T07:20:21+05:30 IST

ఓ యువతి మృతి ఇరాన్‌ను కుదిపేస్తోంది. ఆందోళనలతో దేశం హోరెత్తుతోంది.

ఇరాన్‌ హిజాబ్‌ నిరసనల్లో.. ఐదుగురు మృతి?

గత వారం పోలీస్‌ కస్టడీలో యువతి మృతి

ఆమె మరణంతో మిన్నంటుతున్న ఆందోళనలు

‘‘మహ్సా అమిని’’ హ్యాష్‌ ట్యాగ్‌తో 20 లక్షల ట్వీట్లు 


టెహ్రాన్‌, సెప్టెంబరు 20: ఓ యువతి మృతి ఇరాన్‌ను కుదిపేస్తోంది. ఆందోళనలతో దేశం హోరెత్తుతోంది. హిజాబ్‌ నిబంధనలను పాటించడం లేదంటూ మొరాలిటీ పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్న మహ్సా అమిని (22) మరుసటి రోజే చనిపోవడం పెద్దఎత్తున నిరసనలకు దారితీస్తోంది. మూడు రోజులుగా యువతులు, మహిళల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జుత్తు కత్తిరించుకుంటూ వీడియోలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లు తీసేసి.. దహనం చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసు కాల్పుల్లో ఐదుగురు చనిపోయినట్లు కుర్దుల హక్కుల సంఘాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం ఇచ్చింది. ఈ మరణాలన్నీ కుర్దిసాన్‌ ప్రావిన్స్‌ లోనే సంభవించాయి. కాగా, కుర్దు యువతి అయిన అమిని మరికొందరిని గత వారం మొరాలిటీ పోలీసులు రాజధాని టెహ్రాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆరోగ్యంగానే ఉన్న అమిని.. తర్వాతి రోజు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో ఉండగా అమిని అస్వస్థతకు గురైందని పోలీసులు చెబుతుండగా.. తన కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అమిని తండ్రి పేర్కొంటున్నాడు. ఆమె కాళ్లపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. దీనికి పోలీసుల దాడే కారణమని ఆరోపిస్తున్నాడు. మరోవైపు అమిని మృతిపై నిరసనలు కుర్దిస్థాన్‌కే పరిమితం కాక.. టెహ్రాన్‌ సహా ఇరాన్‌ అంతటా వ్యాపించాయి. పోలీసుల కాల్పుల్లో కుర్దిస్థాన్‌లోని అమిని సొంత నగరం సఖేజ్‌లో ఇద్దరు చనిపోయినట్లు హెంగావ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ ట్వీట్‌ చేసింది. దివాందర్రే్‌హలో భద్రతా బలగాలు ఇద్దరిని నేరుగా కాల్చి చంపాయని వివరించింది. సోమవారమే 75 మంది ఆందోళనకారులు గాయాలపాలైనట్లు పేర్కొంది. దివాందర్రే్‌హలో కొందరు.. పోలీసుల మీదకు రాయి విసురుతున్న వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ‘‘ఇక్కడ యుద్ధం నడుస్తోంది’’ అంటూ ఓ పురుషుడు అరుస్తుండడం ఇందులో వినిపించింది.  అమిని మృతికి నిరసన వ్యక్తం చేస్తూ.. ‘‘మహ్సా అమిని’’ హ్యాష్‌ట్యాగ్‌తో పర్షియన్‌ భాషలో చేసిన ట్వీట్లు 20 లక్షలు దాటడం గమనార్హం.


కుర్దిస్థాన్‌ కుతకుత 


మిని సొంత రీజియన్‌ కావడంతో కుర్దిస్థాన్‌లో ఆందోళనలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీని రాజధాని సనందజ్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ రీజియన్‌లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కాగా.. టెహ్రాన్‌ నుంచి నిరసనలు రష్త్‌, మషాద్‌, ఇస్ఫహాన్‌ నగరాలకూ వ్యాపించాయి. పోలీసు కార్ల అద్దాలను ధ్వంసమైన, ఆందోళనకారులపై వ్యాటర్‌ కేనన్‌లు ప్రయోగించిన దృశ్యాలను ఒకరు ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. రాళ్లు విసురుతూ ఓ మహిళ.. ‘నియంతకు మరణమే’ అంటూ నినాదాలు చేయడం కూడా ఇందులో ఉంది. టెహ్రాన్‌ వర్సిటీ లోనూ ఆందోళనలు జరుగుతున్న వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. కాగా, మరణాలు, పరిస్థితులపై కథనాలు స్థానిక సమాచారమేనని, తమ స్వతంత్ర పరిశీలన కాదని రాయిటర్స్‌ పేర్కొంది. ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ.. ఆందోళనలు స్వల్ప స్థాయిలో జరిగాయని అంటోంది. మరణాలు సంభవించినట్లు వస్తున్న కథనాలను ఇరాన్‌ అధికారిక టీవీ ఖండించింది. మరోవైపు అమిని మృతి మానవ హక్కులకు జరిగిన ఘోరమైన అవమానంగా అమెరికా అభివర్ణించింది. ఫ్రాన్స్‌ కూడా ఈ ఘటనను ఖండించింది. అమిని ఉదంతం.. ఇరాన్‌ ప్రభుత్వం.. ఆ దేశంలోని మైనారిటీలైన కుర్దులకు మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. 

Updated Date - 2022-09-21T07:20:21+05:30 IST