దెబ్బకు దెబ్బ

ABN , First Publish Date - 2021-10-13T06:59:02+05:30 IST

దెబ్బకు దెబ్బ తీశారు మన జవాన్లు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో ఇద్దరు

దెబ్బకు దెబ్బ

  • కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
  • వారిలో ముగ్గురు టీఆర్‌ఎఫ్‌ ముష్కరులు
  • ప్రిన్సిపాల్‌, టీచర్ల హత్యల్లో పాల్గొన్న టీఆర్‌ఎఫ్‌ 
  • ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌ ఉగ్రవాది అరెస్టు
  • 13 ఏళ్ల క్రితం భారత్‌లో చొరబడిన ముష్కరుడు
  • నకిలీ ధ్రువపత్రాలతో అప్పటి నుంచి ఇక్కడే తిష్ఠ


శ్రీనగర్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 12: దెబ్బకు దెబ్బ తీశారు మన జవాన్లు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో ఇద్దరు ముష్కరులను కూడా మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు ఖతం చేశాయి. జిల్లాలోని తల్రాన్‌ ప్రాంతంలో ఓ భవనంలో ముష్కరులు దాక్కొన్నట్లు సమాచారం అందడంతో బలగాలు సోమవారం రాత్రి గాలింపు ప్రారంభించాయి. లొంగిపోవాలని బలగాలు ఎంతగా విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. దీంతో బలగాలు ఆ భవనాన్ని పేల్చివేశాయి. ఈ ఘటనలో టీఆర్‌ఎ్‌ఫకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వారిని ఇద్దరిని కశ్మీర్‌లోని గాందర్బాల్‌కు చెందిన ముఖ్తార్‌ షా, కుల్గాం జిల్లాకు చెందిన బాసిత్‌ అహ్మద్‌దార్‌ (25) గా గుర్తించారు. ఈ ఇద్దరూ మరో ఇద్దరితో కలిసి శ్రీనగర్‌లో ఇటీవలే వివిధ పౌరులను హత్య చేశారు. ఈనెల 5న మఖన్‌లాల్‌ బింద్రూ, బిహార్‌కు చెందిన పానీపూరి వ్యాపారి వీరేంద్ర పాసవాన్‌ను చంపారు. ఈనెల 7న శ్రీనగర్‌లోని ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌ సుపీందర్‌ కౌర్‌, ఉపాధ్యాయుడు దీపక్‌ చంద్‌ను కూడా ఆ ముష్కరులు కాల్చి చంపారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. షోపియాన్‌ జిల్లాలోనే ఫేరిపొరా ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు. కాగా ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టుచేసి భారీ ఉగ్ర కుట్రను భగ్నంచేశారు.


అతడిని పాక్‌లోని పంజాబ్‌కు చెందిన మొహమ్మద్‌ అష్రఫ్‌ (40)గా గుర్తించారు. అతడి వద్ద నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. అతడికి పాక్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రలో అతడికీ భాగస్వామ్యం ఉందని పోలీసులు తెలిపారు. ‘‘13 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌ మీదుగా అతడు భారత్‌లోకి చొరబడ్డాడు. ఫోర్జరీ ద్వారా ధ్రువపత్రాలు సంపాదించి, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతడిని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నాం’’ అని పోలీసులు చెప్పారు.


ఉగ్రవాదులను ఖతం చేయాలి

కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ఐదుగురు వీర సైనికులను హత్యచేసిన ఉగ్రవాదులను వెంటనే అంతం చేయాలని, అప్పుడే వారి హత్యలకు ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుందని శివసేన పేర్కొంది. వివిధ మతాలకు చెందిన ప్రజలు కశ్మీర్‌లో ప్రవేశించకుండా ఉగ్రవాదులు భయంకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ పత్రిక సామ్నాలో ఓ సంపాదకీయం రాసింది. 

Updated Date - 2021-10-13T06:59:02+05:30 IST