రూ.5,000 కోట్ల అమ్మకాలు ఢమాల్‌!

ABN , First Publish Date - 2020-08-03T07:54:38+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారి మిఠాయి పరిశ్రమను వదల్లేదు. వైరస్‌ ప్రభావం రక్షా బంధన్‌ పండగ మిఠాయిల అమ్మకాలపైనా పడింది. ఏటా రక్షా బంధన్‌ పండగకు రెండు మూడు రోజలు ముందు నుంచే

రూ.5,000 కోట్ల అమ్మకాలు ఢమాల్‌!

  • మిఠాయికి కలిసి రాని రక్షా బంధన్‌
  • కరోనా దెబ్బకు దుకాణాల్లో కనిపించని సందడి


ఇండోర్‌: కొవిడ్‌-19 మహమ్మారి మిఠాయి పరిశ్రమను వదల్లేదు. వైరస్‌ ప్రభావం రక్షా బంధన్‌ పండగ మిఠాయిల అమ్మకాలపైనా పడింది. ఏటా రక్షా బంధన్‌ పండగకు రెండు మూడు రోజలు ముందు నుంచే మిఠాయిల షాపులు కొనుగోలుదార్లతో కిటకిటలాడేవి. ఈ ఏడాది మాత్రం ఎక్కడా ఆ సందడే కనిపించడం లేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కరోనా ఇంకా తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. ఇంకా చాలా చోట్ల మిఠాయి షాపులు ఇంకా తెరుచుకోలేదు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశవ్యాప్తంగా మిఠాయిల అమ్మకాలు 50 శాతానికి పైగా (దాదాపు రూ.5,000 కోట్లు) పడిపోతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


రూ.10,000 కోట్ల వ్యాపారం  

దసరా, దీపావళితో పాటు రక్షా బంధన్‌ రోజూ మిఠాయిలు విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గత ఏడాది రక్షా బంధన్‌ రోజు దేశవ్యాప్తంగా సుమారు రూ.10,000 కోట్ల విలువైన మిఠాయిలు అమ్ముడయ్యాయి. కొవిడ్‌, కర్ఫ్యూ నిబంధనలతో ఈ సంవత్సరం అది రూ.5,000 కోట్లు కూడా ఉండకపోవచ్చని ఫెడరేషన్‌ ఆఫ్‌ స్వీట్స్‌ అండ్‌ నమ్‌కీన్స్‌ డైరెక్టర్‌ ఫిరోజ్‌ హెచ్‌ నక్వీ చెప్పారు. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం కూడా ఈ ఏడాది రక్షా బంధన్‌ మిఠాయిల అమ్మకాల్ని దెబ్బతీస్తోందన్నారు.


ఆశలన్నీ జన్మాష్టమిపైనే

ఏటా రక్షా బంధన్‌ నుంచి జన్మాష్టమి వరకు దేశంలో మిఠాయిల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. మొత్తం అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఈ సమయంలోనే ఉంటాయి. రక్షాబంధన్‌ అమ్మకాలు పడిపోవడంతో వ్యాపార వర్గాలు ఇక జన్మాష్టమిపైనే ఆశలు పెట్టుకున్నాయి. మిఠాయి దుకాణాలు తెరవటానికి ఎలాంటి ఆటంకాలు కల్పించకపోతే వ్యాపా రాలు కొద్దిగానైనా గాడిలో పడే అవకాశాలున్నాయని మిఠాయి వ్యాపారులు భావిస్తున్నారు.

Updated Date - 2020-08-03T07:54:38+05:30 IST