అర్హుల గుర్తింపునకు ఐదేళ్లు..

ABN , First Publish Date - 2022-03-04T05:41:34+05:30 IST

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాల్లో మైనార్టీ తీరిన వారికి ప్యాకేజీని వర్తింపజేసేందుకు రూపొందించిన జాబితా ఎట్టకేలకు ఒక కొలిక్కివచ్చింది.

అర్హుల గుర్తింపునకు ఐదేళ్లు..

- ఎట్టకేలకు కొలిక్కివచ్చిన ఎల్లంపల్లి పరిహారం జాబితా

- పద్దెనిమిదేళ్లు నిండిన వారు 1116 ఉన్నారని గుర్తింపు

- రూ. 22.32 కోట్ల విడుదలకు ప్రభుత్వానికి నివేదిక

- త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాల్లో మైనార్టీ తీరిన వారికి ప్యాకేజీని వర్తింపజేసేందుకు రూపొందించిన జాబితా ఎట్టకేలకు ఒక కొలిక్కివచ్చింది. జాబితాను సిద్ధం చేసేందుకు రెవెన్యూ శాఖాధికారులకు ఐదేళ్లు పట్టింది. జిల్లాలోని ఏడు గ్రామాల్లో అర్హులైన వాళ్లు 1116 మంది ఉన్నారని, వారికి 2 లక్షల రూపాయల చొప్పున 22 కోట్ల 32 లక్షల రూపాయలు విడుదల చేయాలని నెల రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్యాకేజీ సొమ్ము త్వరలోనే విడుదల కావచ్చని తెలుస్తున్నది. జిల్లాలోని రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద గోదావరి నదిపై 2004లో 20.175 టీఎంసీల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈప్రాజెక్టు కింద అంతర్గాం మండలం, ముర్మూర్‌, ఎల్లంపల్లి, పాలకుర్తి మండలం మద్దిర్యాల, పొట్యాల, కుక్కలగూడూర్‌, వేంనూర్‌ గ్రామాలతో పాటు జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం తాళ్లకొత్తపేట, చెగ్యాం, కోటిలింగాల గ్రామాలు, మంచిర్యాల జిల్లాకు చెందిన మరో తొమ్మిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో శంకుస్థాపన చేయగా 2005, 2009లో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులకు వారు కోల్పోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. అలాగే నిర్వాసిత కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తారు. అయితే భూ సేకరణలో, పునరావాసం కల్పించడంలో, ప్రాజెక్టు నిర్మాణంలో దశాబ్ద కాలం పట్టడంతో ఆయా కుటుంబాల్లో మైనారిటీ తీరిన వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ విషయమై ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌, అప్పటి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోలేదు. 

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సదరు నేతలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించిన సీఎం 2015 జనవరి 1వ తేది నాటికి ఎంత మంది 18 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయమై సామాజిక, ఆర్థిక సర్వేకు ఆదేశించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పరిఽధిలో 3127 మంది ఉన్నారని, మంచిర్యాల జిల్లాలో 1974 మంది ఉన్నట్లు గుర్తించారు. 2016 సెప్టెంబర్‌, అక్టోబర్‌ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మిస్తున్న మిడ్‌మానేర్‌ కట్టకు గండి పడింది. ఈ గండిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 2015, జనవరి 1వ తేది నాటికి శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేర్‌, గౌరవెల్లి ప్రాజెక్టుల నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లు అయిన వారికి 2 లక్షల చొప్పున ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2017 జనవరి 3వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 3127 మందికి 2 లక్షల చొప్పున 62 కోట్ల 54 లక్షల రూపాయలు, మంచిర్యాల జిల్లాపరిధిలోని ముంపు గ్రామాలకు చెందిన 1974 మేజర్లకు 39 కోట్ల 48 లక్షల రూపాయలను మంజూరుచేసింది. అయితే సర్వే చేసిన జాబితాలను పరిశీలించి అందులో ఎంత మంది అర్హులున్నారు, ఎంత మంది అనర్హులున్నారో గుర్తించి అసలైన జాబితాను పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు త్వరితగతిన సర్వే చేసి జాబితాలను పంపించాల్సిన రెవెన్యూ శాఖాధికారులు తాత్సారం చేస్తూ వచ్చారు. దీనిపై ప్రస్తుతం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సైతం అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. ముంపు కుటుంబాల జాబితాల ఆధారంగా అధికారులు పలుసార్లు సర్వే నిర్వహించారు. అనేక తీసివేతలు, కూడికల అనంతరం ఎట్టకేలకు ఒక జాబితాను సిద్ధం చేశారు. ముర్మూర్‌ గ్రామలో 170 మంది, ఎల్లంపల్లిలో 97 మంది, పొట్యాలలో 336 మంది, మద్దిర్యాలలో 66 మంది, కుక్కలగూడూరులో 101 మంది, ఉండేడులో 103మంది, వేమునూర్‌లో 243 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి 2 లక్షల చొప్పున 22 కోట్ల 32 లక్షల రూపాయల పరిహారం విడుదల చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలో గానీ, వచ్చే నెలలో గానీ దీనికి సంబంధించిన బడ్జెట్‌ విడుదల కావచ్చని తెలుస్తున్నది. 

Updated Date - 2022-03-04T05:41:34+05:30 IST