ఐదేళ్లలో 90,000 కోట్లు

ABN , First Publish Date - 2021-11-25T08:53:07+05:30 IST

విమానాశ్రయాల రంగంలోకి ఐదేళ్లలో రూ.90,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని విమాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌ అన్నారు. ..

ఐదేళ్లలో 90,000 కోట్లు

కొత్త విమానాశ్రయాలపై పెట్టుబడులు.. కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌ 

న్యూఢిల్లీ: విమానాశ్రయాల రంగంలోకి ఐదేళ్లలో రూ.90,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని విమాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌ అన్నారు. అందులో రూ.68,000 కోట్ల వరకు ప్రైవేట్‌ రంగం నుంచి రానుండగా.. మిగతా రూ.22,000 కోట్లు ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఇన్వెస్ట్‌ చేయనుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌ వద్ద రూ.8,914 కోట్లతో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ పనులకు ప్రధాని మోదీ గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. ఈ విమానాశ్రయం 2024 సెప్టెంబరు నాటికి ప్రారంభం కావచ్చని అంచనా. ప్రస్తుతం దేశంలో 136 ఎయిర్‌పోర్టులుండగా (హెలీపోర్టులు, ఏరోడ్రోమ్‌లు కలిపి).. ఐదేళ్లలో 220కి పెరగవచ్చని రాజీవ్‌ బన్సల్‌ అన్నారు. చాలా ఏరోడ్రోమ్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు.

 

ప్రైవేటుకు కీలకేతర భద్రత 

ఏరోడ్రోమ్‌ల్లో కీలకేతర సెక్యూరిటీ పనులను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే దిశగా ఆలోచించాలని ఎయిర్‌పోర్టు ఆపరేటర్లను కోరినట్లు బన్సల్‌ తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ పూర్తి బాధ్యత సీఐఎ్‌సఎ్‌ఫదే. 


ఏడాది చివరికి ఎయిరిండియా ప్రైవేటీకరణ

ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియను డిసెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం   అన్ని విధాలా కృషి చేస్తోందని బన్సల్‌ అన్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 


వచ్చే పదేళ్లలో భారత్‌ నం.1

కోల్‌కతా: వచ్చే దశాబ్దకాలంలో విమానయానంలో అగ్రస్థానానికి చేరుకునే సత్తా భారత్‌కుందని పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఓ వర్చువల్‌ సదస్సులో ఇండస్ట్రీ వర్గాలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఢిల్లీ, ముంబైలో రెండో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కోల్‌కతా సహా ఇతర మెట్రో నగరాల్లోనూ రెండో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 

Updated Date - 2021-11-25T08:53:07+05:30 IST