ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు అభ్యంతరమా?

ABN , First Publish Date - 2021-10-23T08:16:09+05:30 IST

డిండి ప్రాజెక్టును సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ...

ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు అభ్యంతరమా?

డిండిపై ఏపీ పిటిషన్‌ను కొట్టేయండి.. ఎన్జీటీలో తెలంగాణ అఫిడవిట్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డిండి ప్రాజెక్టును సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2016 నుంచే ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఇన్నాళ్లు నిద్రపోయి ఐదేళ్ల తర్వాత పిటిషన్‌ వేసిందని తెలిపారు. ఇది ఎన్జీటీ చట్టంలో పేర్కొన్న కాల పరిమితికి విరుద్ధమని చెప్పారు. అవాస్తవాలను పేర్కొని దురుద్ధేశంతో ఈ పిటిషన్‌ వేసిందని ఆరోపించారు. ఎన్జీటీ చట్టం ప్రకారం చర్య తీసుకోవాల్సిన సమస్య ఉత్పన్నమైన ఆరు నెలల్లో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ‘‘నల్గొండ జిల్లా దేవరకొండ, మునుగోడు, మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు నీరు అందించాలన్న ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి డిండి రిజర్వాయర్‌కు రోజుకు రూ. 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద 19 మండలాల్లో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. రూ.6190 కోట్ల అంచనా వ్యయాలతో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్‌ 11న పరిపాలన అనుమతులు ఇచ్చింది. 


ఈ ప్రాజెక్టు గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇన్ని రోజులు ఈ ప్రాజెక్టుకు గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియదని భావించలేం’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో వాస్తవాలు, మెరిట్స్‌లోకి వెళ్లక ముందే విచారణను ముగించాలని కోరారు. పిటిషన్‌లో తప్పుదోవ పట్టించే అంశాలు అనేకం ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనలు, అంశాలపై ఆధారపడి ఈ పిటిషన్‌ దాఖలు చేసినందున దీన్ని విచారించే పరిధి ఎన్జీటీకి లేదని తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-10-23T08:16:09+05:30 IST