రుచుల సంక్రాంతి!

ABN , First Publish Date - 2021-01-09T06:18:32+05:30 IST

సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు, ముగ్గులే కాదు. నోరూరించే వంటకాలు కూడా ఉంటాయి.

రుచుల సంక్రాంతి!

సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు, ముగ్గులే కాదు. నోరూరించే వంటకాలు కూడా  ఉంటాయి. మన దగ్గరే కాదు దేశమంతటా  సంప్రదాయ వంటలతో వేడుకలు ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ పండుగ వేళ కొన్ని రాష్ట్రాల రెసిపీలనుమీరూ రుచి చూడండి.




నువ్వుల చిక్కీలు

పండుగ రోజున గుజరాతీలు ఇష్టంగా తినే స్నాక్‌ ఇది.


కావలసినవి

నువ్వులు - ముప్పావు కప్పు, బెల్లం - అర కప్పు, నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్‌.


తయారీ విధానం

 స్టవ్‌పై పాన్‌ పెట్టి నువ్వులను వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.

 అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక బెల్లం వేసి కలపాలి. చిన్న మంటపై రెండు, మూడు నిమిషాలు ఉంచి కలపాలి.

 తరువాత నువ్వులు వేసి కలియబెట్టుకోవాలి. 

 ఇప్పుడు నెయ్యి రాసిన మందపాటి పాత్రలో మిశ్రమాన్ని సమంగా పోయాలి. కత్తితో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

 చల్లారిన తరువాత పాత్రలో భద్రపరచుకుని సర్వ్‌ చేసుకోవాలి.




పిన్ని

పండుగ రోజుల్లో పంజాబీలు చేసుకునే వంటకం ఇది.


కావలసినవి

గోధుమపిండి - పావుకేజీ, నెయ్యి - 250 గ్రాములు, పంచదార - పావుకేజీ, పాలు - అరకప్పు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీడిపప్పు - 25గ్రాములు, బాదం - 25 గ్రాములు, ఎండుద్రాక్ష - 25 గ్రాములు.


తయారీ విధానం

 స్టవ్‌పై మందపాటి పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోధుమపిండి వేసి వేగించాలి.

 తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి. 

 పంచదార, యాలకుల పొడి, పాలు పోసి కలపాలి. 

 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బంతుల్లా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ 

చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.




పాతిశప్త పిత

సంప్రదాయ బెంగాలీ వంటకం ఇది.


కావలసినవి

సేమ్యా లేదా రవ్వ - పావుకేజీ, మైదా - 400 గ్రా, పంచదార 200గ్రా, కోవా - 300గ్రా, నూనె - సరిపడా, పాలు - ఒక లీటరు.


తయారీ విధానం

 ముందుగా పాలను బాగా మరిగించాలి. పాలు చిక్కగా అవుతున్న సమయంలో కోవా, కొద్దిగా పంచదార వేసి చిక్కటి పేస్టులా అయ్యేలా చేసుకోవాలి.

 మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మిగిలిన పంచదార వేయాలి.

 స్టవ్‌పై ఫ్రై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కొద్దిగా నూనె వేసుకుంటూ రవ్వ, మైదా పిండి మిశ్రమాన్ని దోశలా పోయాలి.

 తరువాత చిక్కటి పేస్టులా చేసుకున్న కోవా మిశ్రమాన్ని పైన వేసి రోల్‌లా చుట్టాలి. 

 గోధుమరంగులోకి మారే వరకు కాల్చి సర్వ్‌ చేసుకోవాలి.


 




మకర చౌలా

ఓడిశా ప్రజలు సంక్రాంతి రోజున చేసుకునే సంప్రదాయ వంటకం ఇది.


కావలసినవి

 బాస్మతి బియ్యం - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, అరటిపండ్లు - మూడు, ఆపిల్‌ ముక్కలు - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, దానిమ్మ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం

 బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.

 తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. 

 కొబ్బరి తురుము, పాలు వేసి మరోసారి గ్రైండ్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.

 ఇప్పుడు ఆపిల్‌ ముక్కలు, పంచదార, దానిమ్మగింజలు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. 

 అరటి పండు ముక్కలు వేసి మకర చౌలాను సర్వ్‌ చేయాలి. 




పూరన్‌ పోలి

సంక్రాంతి పర్వదినాన మహారాష్ట్రలో ఈ రెసిపీ తయారుచేసుకుంటారు. 


కావలసినవి

పూరన్‌ మిశ్రమం : బెల్లం - ఒక కప్పు, సెనగపప్పు -  ఒకకప్పు, నీళ్లు - మూడు కప్పులు, నెయ్యి - రెండు టీస్పూన్లు, సోంపు పొడి - ఒక టీస్పూన్‌, శొంఠి పొడి - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌. 

పోలి : గోధుమపిండి - రెండు కప్పులు, నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా.


తయారీ విధానం

 ముందుగా పూరన్‌ మిశ్రమం తయారు చేసుకోవాలి. సెనగపప్పును శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌లో ఏడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత నీటిని ఒక పాత్రలోకి వంచి సెనగపప్పును పక్కన పెట్టుకోవాలి. 

 స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక శొంఠి పొడి, జాజికాయ పొడి, యాలకుల పొడి, సోంపు పొడి వేసి వేగించాలి.

 ఇప్పుడు ఉడికించిన సెనగపప్పు, బెల్లం వేసి కలుపుకోవాలి. చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. 

 ఈ మిశ్రమం చల్లారిన తరువాత పప్పు రుద్దే కర్రతో మెత్తగా చేసుకోవాలి. అవసరమైతే మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవచ్చు.

 మరొక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నెయ్యి, తగిననన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

 ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని కాస్త మందంగా ఉండేలా చపాతీలా చేసుకోవాలి. మధ్యలో సెనగపప్పు మిశ్రమం పెట్టి  అన్ని వైపులా చపాతీని దగ్గరకు ఒత్తాలి. తరువాత నెమ్మదిగా చపాతీ కర్రతో పూరన్‌ పోలీ తయారుచేసుకోవాలి.

 స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పూరన్‌ పోలీలను కాల్చాలి. రెండు వైపులా కాల్చిన తరువాత నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.




మినప్పప్పు కచోరి

మకర సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈ వంటకం తప్పక తయారు చేసుకుంటారు. 


కావలసినవి 

మైదా - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు - అరకప్పు, అల్లం ముక్క - చిన్నది, పచ్చిమిర్చి - రెండు, నెయ్యి - అర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, సోంపు పొడి - అర టీస్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా. 


తయారీ విధానం

 మినప్పప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.

 ఒక పాత్రలో పిండిని తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, కొద్దిగా ఉప్పు, నెయ్యి, కొద్దిగా నూనె వేసి కలియబెట్టుకోవాలి.

 తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా అయ్యేలా కలుపుకొని పలుచట్టి వస్త్రం కప్పి పక్కన పెట్టాలి.

 ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కాసేపు వేగిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు, ఇంగువ వేసుకోవాలి. 

 తరువాత మినప్పప్పు పేస్టు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి.

 ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నసైజు బాల్స్‌లా చేసుకోవాలి.

 ఇప్పుడు మెత్తగా కలిపిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. తరువాత మధ్యలో మినప్పప్పు మిశ్రమం బాల్‌ను పెట్టాలి. చివరలు దగ్గరకు ఒత్తి మళ్లీ చేత్తో కచోరీలా ఒత్తుకోవాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కచోరీలు వేసి వేగించి తీసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-01-09T06:18:32+05:30 IST