చక్రాలపై విమానయానం!

ABN , First Publish Date - 2022-01-25T13:19:04+05:30 IST

చక్రాలపై విమానయానం!

చక్రాలపై విమానయానం!

దక్షిణాఫ్రికా టు నెదర్లాండ్స్‌ 

11 గంటల ప్రయాణం

విమానం చక్రాలపై కూర్చుని దుస్సాహసం

చిన్న చిన్న సమస్యలు మినహా ఆరోగ్యంగా కిందకు


ఆమ్‌స్టర్‌డ్యామ్‌, జనవరి 24: విమానం చక్రాల ప్రాంతంలో కూర్చుని ప్రయాణించడం సాధ్యమేనా? అలా ఎవరైనా ప్రయాణిస్తారా? అంటే.. గతంలో ఎప్పుడో ఓసారి భారత్‌ నుంచి లండన్‌కు ఓ ఇద్దరు వ్యక్తులు ఇలా ప్రయాణించారని విన్నాం. అందులో ఒకరు మరణించగా.. మరొకరు కొన ఊపిరితో ఆస్పత్రిపాలై కోలుకున్నారు. గత ఏడాది అఫ్ఘానిస్థాన్‌ సంక్షోభ సమయంలో దేశం విడిచి పారిపోయే యత్నంలో ఇద్దరు అఫ్ఘాన్లు ఇలాగే యత్నించి వందల అడుగుల ఎత్తు నుంచి కిందపడి దారుణంగా మరణించారు. కాగా, ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాంటి ప్రమాదకర ప్రయత్నమే చేశాడు. సాహసయాత్రగా భావించాడో.. లేదా ప్రాణాల మీదికొచ్చి దేశం విడిచి పారిపోవాలనుకున్నాడో తెలియదు గానీ.. విమానం చక్రాల ప్రాంతంలో కూర్చుని దాదాపు 11 గంటల పాటు ప్రయాణించాడు.


విచిత్రంగా అతడు ప్రాణాలతో నిక్షేపంగా ఉన్నాడు. శరీర ఉష్ణోగ్రత పెరగడం మినహా.. పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవలేదు. దక్షిణాఫ్రికాలోని జొహన్నె్‌సబర్గ్‌ నుంచి నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు జనవరి 23న.. ఓ సరుకు రవాణా విమానం (బోయింగ్‌ 747) బయలుదేరింది. ఆ సమయంలో ఓ వ్యక్తి.. విమానాశ్రయ అధికారుల కన్నుగప్పి.. చక్రాల పైభాగానికి చేరుకున్నాడు. అక్కడ బయలుదేరిన విమానం.. మధ్యలో కెన్యా రాజధాని నైరోబీలో ఆగింది. అక్కడా అతడ్ని ఎవరూ గుర్తించలేదు. అనంతరం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ చేరేవరకు విమానం.. ఏకబిగిన ప్రయాణించింది. సముద్రమట్టానికి 35 వేల అడుగుల ఎత్తులో.. గంటకు 885 కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణించింది. ఆ ఎత్తులో ఉండే స్థిర ఉష్ణోగ్రత -54 డిగ్రీల సెల్సియస్‌. పైగా.. గాలిలో ఆక్సిజన్‌ కూడా సాధారణం కంటే 25 శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి స్థితిని ఆ వ్యక్తి శరీరం 11 గంటల పాటు తట్టుకుంది. విమానం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో దిగే సమయంలో.. అధికారులు ఆ వ్యక్తిని గుర్తించారు. వెంటనే అతడ్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల మినహా.. ఆరోగ్య పరంగా అతడిలో పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వాతావరణంలో అంతసేపు ప్రయాణించి క్షేమంగా కిందికి దిగడం అసాధారణమని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి అతడి గురించిన వివరాలేవీ తెలియదని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత దర్యాప్తు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2022-01-25T13:19:04+05:30 IST