కృష్ణమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2021-08-02T06:09:18+05:30 IST

కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతూ పరుగున వస్తోంది.

కృష్ణమ్మ పరవళ్లు

ఎగువ నుంచి పెరుగుతున్న వరద

బ్యారేజ్‌ 36 గేట్లను ఎత్తిన అధికారులు

సముద్రంలోకి 26,820 క్యూసెక్కులు

కాల్వలకు 9,249 క్యూసెక్కులు

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం


కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతూ పరుగున వస్తోంది. ఎగువ నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుతోంది. నదిలో నీటి ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. బ్యారేజ్‌ 70 గేట్లలో 36 గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల గుండెల్లో ఈ వరద గుబులు పుట్టిస్తోంది. అధికారులు వీరిని అప్రమత్తం చేస్తూ లోతట్టులో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.


విజయవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : కొద్ది రోజులుగా ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు నీరు వస్తూనే ఉంది. అందంతా కలిపి ఐదు నుంచి ఆరు వేల క్యూసెక్కుల వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది ఉన్నట్టుండి పెరిగింది. ఆదివారం సాయంత్రానికి ఎగువ నుంచి 33,619 క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌ను తాకింది. పులిచింతల నుంచి 31,077 క్యూసెక్కులు వస్తుండగా, పాలేరు నుంచి 353, కీసర నుంచి 2,189 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీని నుంచి 26,820 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజ్‌ 70 గేట్లలో 36 గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా గుంటూరు కెనాల్‌తోపాటు జిల్లాలోని కాల్వలకు 9,249 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ఆదివారం ఉదయం వరకు వరద నీరు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి ప్రవాహ ఉధృతి పెరిగింది. శనివారం రాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి విడుదలను పెంచారు. నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, సాయంత్రానికి 580 అడుగులకు చేరుకుంది. కొద్ది గంటల్లోనే మిగిలిన పది అడుగులకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సాగర్‌ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని పులిచింతలకు పంపుతున్నారు. ప్రస్తుతం పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వతో కనిపిస్తోంది. ఎగువ నుంచి నీరు వస్తుండడంతో పులిచింతలలో ఉన్న నీటిని అధికారులు కిందికి విడుదల చేశారు. పులిచింతల నుంచి రాత్రి ఏడు గంటలకు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు సోమవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నానికి ఇది రెండు లక్షలకు చేరుతుందని జలవనరుల శాఖ ఎస్‌ఈ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. మొత్తంగా ప్రకాశం బ్యారేజ్‌కు 4.5 నుంచి 5లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. 


అధికారులు అప్రమత్తం

భారీమొత్తంలో వరద నీరు వస్తే కృష్ణలంకలోని రణదివే నగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల్లోకి నీరు చేరడం ఖాయం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రామలింగేశ్వరనగర్‌ వైపున వరద నీరు నివాసాల్లోకి రాకుండా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించినప్పటికీ దానికి ఉన్న రంధ్రాల ద్వారా వచ్చేస్తోంది. ఈసారి ఇలాంటి బెడద లేకుండా నది పరిరక్షణ విభాగ అధికారులు ఆ రంధ్రాలను మూయించే పనులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువన వైకుంఠపురం వరకు, బ్యారేజ్‌ దిగువ నుంచి కొల్లిపర, కొల్లూరు వరకు మొత్తంగా 11 - 12 పాయింట్ల నుంచి వరద నీరు కాలనీలు, వీధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందుకోసం లక్షకు పైగా ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. వాటితోపాటు వచ్చిన నీటిని పంపింగ్‌ చేయడానికి డీజిల్‌ మోటార్లను సిద్ధంగా ఉంచారు. తొలుత రెండు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుందని, అది క్రమంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నదిని ఆనుకుని ఉన్న వారి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.


ముక్త్యాల వద్ద వరద పోటు

జగ్గయ్యపేట రూరల్‌, ఆగస్టు 1 : కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న నీటితో జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల వద్ద వరద పోటెత్తుతోంది. నదిలో భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం ఆదివారం సగానికిపైగా మునిగింది. పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటితో పాటు రావిరాల వద్ద కృష్ణానదిలో సంగమిస్తున్న పాలేటి నీరు కూడా వెనక్కు రావటంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.  



Updated Date - 2021-08-02T06:09:18+05:30 IST