వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-10-01T07:10:37+05:30 IST

గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువభాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రోజుల నుంచి వరద తాకిడి ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

వరద ఉధృతి
రాజమహేంద్రవరంలో వరద గోదారి

  • ఏజెన్సీ గ్రామాలను ముంచెత్తిన వరద   
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద 32. 8 మీటర్ల నీటిమట్టం
  •  స్పిల్‌వే నుంచి  8.6 లక్షల క్యూసెక్కుల బ్యారేజీకి
  • ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7,83,817 క్యూసెక్కుల సముద్రంలోకి 

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువభాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రోజుల నుంచి వరద తాకిడి ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కానీ ఇప్పటికే ఏజెన్సీలోని పలు గ్రామాలు మునిగిపోయాయి. దేవీపట్నంలోని సుమారు 30 గ్రామాలు వరదలో ఉన్నాయి. కొండమొదలు గ్రామంలో ప్రజలు అక్కడే ఉండి, కొండల మీదకు ఎక్కారు. శబరి పొంగడంతో విలీన మండలాలలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. కూనవరం మండలంలో ఇన కోండ్రాజుపేట కాజ్‌వే పైకి నీరు చేరింది. చింతూరు మండలంలో సోకులేరు వాగు పొంగడంతో చింతూరు- వీఆర్‌ పురం మధ్య  రాకపోకలు ఆగిపోయాయి. మిర్చి, వరి పంటలు మునిగిపోయాయి. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఏకంగా 32.9 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అనేక గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. కోనసీమలంకలోకి నీరు చేరుతోంది. కాజ్‌వేల నుంచి పొర్లుతోంది. ఇక్కడ కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. స్పిల్‌ వే నుంచి  8.6 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాజమహేంద్రవరం అఖండ గోదావరిలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం 175 గేట్లు ఎత్తేసి సాయంకాలం ఆరు గంటలకు 7,83, 817 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ బ్యారేజీ నీటిమట్టం 10.20 అడుగులకు చేరింది. రేపోమాపో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలంలో మొదటి హెచ్చరిక జారీ అయింది. అక్కడ గోదావరి నీటి మట్టం 43.40 అడుగులు ఉంది. కాగా పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ లక్ష్మీశ ఆదేశించారు.

కనకాయలంకకాజ్‌వే మళ్లీ మునిగింది..

పి.గన్నవరం : గోదావరి వరద తాకిడి కోనసీమకు మళ్లీ తగిలింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం చాకలిపాలెం  వద్ద కనకాయలంక కాజ్‌వే వరదకు మునిగింది. ఆ వరద నీటిలోనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక గంటిపెదపూడి శివారు పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామస్తులు ఇంజన్‌ పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమగోదావరి వైపు కూడా పడవలపైనే ఆధారపడుతున్నారు.

Updated Date - 2021-10-01T07:10:37+05:30 IST