పోటెత్తుతున్న ప్రాజెక్టులు !

ABN , First Publish Date - 2020-09-24T09:37:10+05:30 IST

ఎగువున కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అవి నీటి ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 1.62లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 32

పోటెత్తుతున్న ప్రాజెక్టులు !

ఎస్సారెస్పీలోకి 1.62లక్షల క్యూసెక్కులు..

మేడిగడ్డ, జూరాలకు అదే ఉధృతి

నిండుకుండల్లా మూసీ, పులిచింతల 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎగువున కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అవి నీటి ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 1.62లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 32 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద గోదావరి 8.9 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌ డ్యాంల నుంచి వస్తున్న నీటితో మేడిగడ్డ బ్యారేజీలోకి 3.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా 46 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.


జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను 8.396 టీఎంసీ (318.890 మీటర్లు)లకు చేరుకుంది. 1,42,435 క్యూ సెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా, 643.80 అడుగులకు చేరింది. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మ ట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుత్తం 173.78 అడుగులకు చేరింది. మరోవైపు, సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టులో నీరు 20 టీఎంసీలకు చేరుకుంటోంది. 


సాగర్‌కు తగ్గిన వరద 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు బుధవారం రాత్రి వరద ఉధృతి తగ్గింది. 12 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.20 అడుగులుగా (309.6546 టీఎంసీలు) ఉంది. శ్రీశైలం నీటి మట్టం 884.30 అడుగులుగా ఉంది. 


గొర్రెల కాపరిని రక్షించిన పోలీసులు 

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని కామోల్‌కు చెందిన గొర్రెల కాపరి రాము.. మేకలు, గొర్రెలతో సహా గడ్డెన్న వాగు ప్రవాహంలో చిక్కుకుపోగా పోలీసులు రక్షించారు. ఎస్సై పున్నం చందర్‌.. వాగు ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి గేట్లు మూసివేయించడంతో ప్రవాహం తగ్గి రాము క్షేమంగా బయటకొచ్చాడు. నిమామాబాద్‌ నగర శివారులోని పాంగ్రా వాగులో పడి సిద్ధార్థ్‌ (10) గల్లంతయ్యాడు.  

Updated Date - 2020-09-24T09:37:10+05:30 IST