వరద బీభత్సం!

ABN , First Publish Date - 2021-09-08T05:25:22+05:30 IST

అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరద బీభత్సం సృష్టించింది.

వరద బీభత్సం!
జలుమూరు మండలంలో ముంపుబారిన వరి పొలాలు


 ముంపుబారిన 3 వేల ఎకరాలు

 ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, కాలువలు

దారుణంగా దెబ్బతిన్న రహదారులు

జల దిగ్బంధంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు

అసౌకర్యానికి గురైన ప్రయాణికులు

 పాఠశాలల్లోకి చొచ్చుకెళ్లిన వరద నీరు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/టెక్కలి/నరసన్నపేట/గార/సీతంపేట/ఎల్‌ఎన్‌పేట)

అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరద బీభత్సం సృష్టించింది. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆది, సోమవారాల్లో చాలాచోట్ల కుండపోతగా వర్షం పడింది. సోమవారం అర్ధరాత్రి వరకూ వర్షం ఉధృతి కొనసాగింది. మంగళవారం మాత్రం కాస్త శాంతించింది. చిరుజల్లులకే పరిమితమయ్యాయి. ఒడిశాతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగావళి, వంశధార, బాహుదా, సువర్ణముఖి, నాగావళి నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమ్యారు. రిజర్వాయర్లు, బ్యారేజీల్లో గేట్లు ఎత్తి నీటినికి కిందకు విడిచి పెడుతున్నారు. వంశధార ప్రభావిత ప్రాంతాలైన హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, టెక్కలి, గారలో వరద నీటి ఉధృతి అధికంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మూడు వేల ఎకరాల్లో పంట నీటి మునిగింది. వరద నీటి ప్రభావం తగ్గుముఖం పడితే కానీ నష్టాన్నిఅంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. 

-శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాంగణంతో పాటు లోపలికి వరద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం నుంచి వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.   ప్రజా సంఘాల నేతలు చేపలు పడుతూ నిరసన తెలిపారు. నరసన్నపేట బోర్డు ప్రాథమిక పాఠశాల, గార మండలం అడవరం ప్రాథమిక పాఠశాలల్లోకి వరద నీరు ప్రవేశించింది. మోకాలి లోతులో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అసౌకర్యానికి గురయ్యారు. 

-వర్షాలకు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే అస్తవ్యస్తంగా, గోతులమయంగా ఉన్న రహదారుల్లో నీరు చేరడంతో వాహన చోదకులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా అలికాం-బత్తిలి రోడ్డు దారుణంగా దెబ్బతింది. శ్రీకాకుళం-ఆమదాలవలస మధ్య అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. కొత్తరోడ్డు జంక్షన్‌ నుంచి రాగోలు వెళ్లే మార్గంలో భారీ గోతులు చెరువులను తలపిస్తున్నాయి. ఎల్‌ఎన్‌పేట, హిరమండలం వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రోడ్లు కోతకు గురవుతున్నాయి. గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తీసిన గోతుల్లో వరద నీరు చేరింది. దీంతో పనులకు అసౌకర్యం కలుగుతోంది. హైవేపై ప్రయాణం నరకయాతనగా మారింది. 

 నష్టాన్ని అంచనా వేస్తున్నాం

జిల్లా వ్యాప్తంగా వర్షం నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం వరి పొలాలు నీటిలో ఉన్నాయి. వరద నీరు తగ్గిన వెంటనే ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఈ వర్షాలతో చాలాచోట్ల ఉబాలు ప్రారంభమయ్యాయి. వర్షాభావం ఉన్న మండలాలకు మాత్రం వర్షాలు ఎంతో ప్రయోజనకరం. 

-శ్రీధర్‌, వ్యవసాయ శాఖ జేడీ, శ్రీకాకుళం




Updated Date - 2021-09-08T05:25:22+05:30 IST