ఆసరా పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ

ABN , First Publish Date - 2021-11-12T07:00:40+05:30 IST

పేదలకు సురక్షిత జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్లకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.

ఆసరా పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ

ఉమ్మడి జిల్లాలో 82,115 దరఖాస్తులు 

57 ఏళ్లకు అర్హత కుదించడంతో పెరిగిన అర్జీలు

(నల్లగొండ)

పేదలకు సురక్షిత జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్లకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌ అర్హతను 57 ఏళ్లకు కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్టోబరు 30 వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,115 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ర్హత కుదించడంతో..

ఇప్పటి వరకు వరకు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఆసరా పింఛన్లు అందుతుండగా, 57ఏళ్లు నిండిన వారికి సైతం అమలుచేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ఇప్పటి వరకు మొత్తం రెండుమార్లు గడువు సైతం ఇచ్చారు. దరఖాస్తులకు తొలుత ఈ ఏడాది ఆగస్టు 31 వరకు గడువు ఇవ్వగా, దీన్ని అక్టోబరు 30 వరకు పెంచారు. ఎలాంటి రుసుము వసూలుచేయకపోవడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుదారుడికి మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణి 3 ఎకరాలకు మించి ఉండకూడదనే నిబంధన విధించింది. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించి ఉండకూడదు. ఓటరు కార్డుపై ఉన్న పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకొని వయస్సును నిర్ధారించారు. అదేవిధంగా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారి నుంచే అధికారులు దరఖాస్తు స్వీకరించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,115 దరఖాస్తులు రాగా, అందులో నల్లగొండ జిల్లాలో 36,916, సూర్యాపేట జిల్లాలో 26,204, యాదాద్రి జిల్లాలో 18,996 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో దరఖాస్తులు రాగా, ఆ తరువాత స్థానాల్లో సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 1,74,612 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 1,26,203 మంది, యాదాద్రి జిల్లాలో 92,500 మంది లబ్ధిదారులు ఉన్నారు.

ఇంకా ప్రారంభంకాని పరిశీలన

ఆసరా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా, ఆ తరువాత ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో అధికార యంత్రాంగం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. మార్గదర్శకాలు రాకపోవడంతో దరఖాస్తుల పరిశీలనకు మరికొంత సమయంపట్టే అవకాశం ఉంది. అసరా పింఛన్లను ప్రభుత్వం నిరుపేదలకు, వృద్ధులకు, హెచ్‌ఐవీ బాధితులు, వితంతువులు, దివ్యాంగులకు అందజేస్తోంది. అదేవిధంగా చేనేత కార్మికులు, బీడీ కార్మికులు బోధకాలు వ్యాధిగ్రస్థులు, కల్లు గీత కార్మికులకు సైతం ప్రభుత్వం పింఛన్లను వర్తింపజేసింది. పింఛన్ల కింద అందరికీ రూ.2,116 ఇస్తుండగా, దివ్యాంగులకు మాత్రం రూ.3,116 ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఈ పథకం వర్తింపు వయసును ప్రభుత్వం తగ్గించడంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు త్వరగా అమలుచేయాలని కోరుతున్నారు. త్వరితగతిన పింఛన్‌ వస్తే కుటుంబ ఖర్చులకు ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు.

త్వరలో లబ్ధిదారుల ఎంపిక : కాళిందిని, డీఆర్డీవో, నల్లగొండ 

ఆసరా పింఛన్లను 57 ఏళ్లు నిండిన వారికి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం మీ-సేవా కేంద్రాల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా నూతన పింఛన్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తాం. ఆ తరువాతే పింఛన్‌ సొమ్ము లబ్ధిదారులకు నెలనెలా జమ అవుతుంది.

ఆసరా పింఛన్లు ఇలా..

జిల్లా లబ్ధిదారులు         కొత్త దరఖాస్తులు

నల్లగొండ 1,74,612 36,916

యాదాద్రి 92,500 18,996

సూర్యాపేట 1,26,203 26,204

మొత్తం 3,93,315 82,116

Updated Date - 2021-11-12T07:00:40+05:30 IST