ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల వరద

ABN , First Publish Date - 2021-03-22T06:09:23+05:30 IST

ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిధులు వెల్లువెత్తాయి. మార్చి 10వ తేదీ నాటికి ఎఫ్‌పీఐలు భారత

ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల వరద

201213 తర్వాత గరిష్ఠం


ముంబై: ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిధులు వెల్లువెత్తాయి. మార్చి 10వ తేదీ నాటికి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో 3600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే గరిష్ఠం. అయితే జనవరి నెలలో మాత్రం ఎఫ్‌పీఐ నిధుల ప్రవాహం కొంత తగ్గినట్టు ఆర్‌బీఐ బులెటిన్‌లోని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ ఏడాదిలో ఈక్విటీల్లో నికరంగా ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు డెట్‌ మార్కె ట్లో భారీ అమ్మకాలు సాగించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ అధిక రాబడులతో ఆకర్షణీయంగా ఉండడం, అమెరికా ప్రకటించిన కరోనా ప్యాకేజితో మార్కెట్లో లిక్విడిటీ తగినంతగా ఉండడం మన మార్కెట్లోకి ఎఫ్‌పీఐ నిధులు వెల్లువెత్తడానికి కారణమంటున్నారు. 


ప్రధానాంశాలు...

ప్రథమ శ్రేణిలో వర్గీకరణలోకి వచ్చే సెంట్రల్‌ బ్యాంకులు, ప్రభుత్వ ఫండ్‌లు, పెన్షన్‌ ఫండ్‌లు వంటి సంస్థల వాటా ఈ నిదుల్లో 95 శాతం ఉంది. అంటే దేశంలోకి నాణ్యమైన ఎఫ్‌పీఐలే అధికంగా వచ్చాయి.

మార్చి నెలలో కూడా ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగానే ఉన్నాయి. ఆ సంస్థలు మార్కెట్లో రూ.14,202 కోట్లు ఇన్వెస్ట్‌ చేసి రూ.5560 కోట్లు ఉపసంహరించాయి. అంటే నికరంగా రూ.8642 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

నికరంగా జనవరిలో రూ.14,649 కోట్లు, ఫిబ్రవరిలో రూ.23,663 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చాయి. 

ఒక్క భారత మార్కెట్లో తప్పితే ఆసియా మార్కెట్లన్నింటి నుంచి ఎఫ్‌పిఐలు నిధులు భారీగా ఉపసంహరించారు. 

జనవరి 5వ తేదీ నాటికి ఆర్‌బీఐ వద్ద 58,030 కోట్ల డాలర్ల విదేశీ మారకం నిల్వలున్నాయి. అంటే 18.2 నెలల దిగుమతులకు సరిపోయే నిల్వలు మన చేతిలో ఉన్నాయన్న మాట.

ఫిన్‌టెక్‌ పెట్టుబడుల్లో 60 శాతం వృద్ధితో మన దేశం చైనాను దాటిపోయింది. ఫిన్‌టెక్‌ కంపెనీలు మొత్తం 33 డీల్స్‌ ద్వారా 64,750 కోట్ల డాలర్లు ఆకర్షించాయి. కరోనా మహమ్మారి కాలంలో భారీగా పెరిగిన డిజిటల్‌ చెల్లింపులు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. 





ఎఫ్‌డీఐదీ అదే ధోరణి

ఇదిలా ఉండగా ఈ ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా గణనీయంగా వచ్చాయి. జనవరి చివరినాటికి నికరంగా 4400 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు మార్కెట్లోకి వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు 3630 కోట్ల డాలర్లు. డిసెంబరు నెలలో గరిష్ఠంగా 630 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి.


Updated Date - 2021-03-22T06:09:23+05:30 IST