వరదకాలం

ABN , First Publish Date - 2020-08-19T06:30:31+05:30 IST

వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా గోదావరి ఉగ్రరూపాన్ని, ఉధృతరూపాన్ని ప్రదర్శిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా...

వరదకాలం

వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా గోదావరి ఉగ్రరూపాన్ని, ఉధృతరూపాన్ని ప్రదర్శిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా, వరంగల్ నగరం వరుణాగ్రహానికి లోనయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరీతీర ప్రాంత గ్రామాలన్నీ ముంపును చవిచూస్తున్నాయి. ఐదునెలలుగా కరోనా మహమ్మారి కారణంగా జనజీవనంలో వచ్చిన మార్పులకు తోడు, ఈ తీవ్రవర్షాలు ప్రజలకు గోరుచుట్టు మీద గొడ్డలిపోటు లాగా బాధిస్తున్నాయి.


తుఫానులు, వరదలు, భూకంపాలు, కరువులు- వీటిని ప్రకృతి వైపరీత్యాలని పిలుస్తాము. వాటి నుంచి పూర్తిగా తప్పించుకోవడం మనిషికి ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, వాటి దుష్ఫలితాలను నివారించడం, నిరోధించడం ప్రభుత్వాలు, సమాజాల చేతుల్లోనే ఉంటుంది. తుఫానులు, భారీ వర్షాలు- బలహీనమైన నివాసాలున్నవారిని, లోతట్టు ప్రాంతాల వారిని బాధించినంతగా, డాబా ఇళ్ల వారిని, ఎగువ ప్రాంతాల నివాసాలను బాధించవు. అట్లాగే కరువులు కూడా ప్రధానంగా మనుషుల మధ్య పంపిణీ సమస్య. ఆ తరవాతే అది వర్షాభావానికి, వాతావరణానికి సంబంధించిన అంశం. మన ప్రభుత్వాలకు వైపరీత్యాలు ప్రజలను బాధితులుగా చూడడానికి, ఏదో ఒకరకమయిన సహాయహస్తం అందించడానికి ఒక అవకాశం. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచన చేయకుండా, ఏటేటా వరదలు వచ్చినప్పుడు సహాయకార్యక్రమాలను అమలుచేయడం మీదనే రాజకీయ పక్షాలు ఆసక్తి చూపుతాయి. అధికారపక్షానికి వితరణకు అవకాశం, ప్రతిపక్షానికి విమర్శకు అవకాశం. విపత్తులను ఎదుర్కొనడానికి స్థిరవ్యవస్థలు ఉండాలని, ఒక వ్యూహం అవసరమని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా రెండుమూడు దశాబ్దాల నుంచే మొదలయింది. అనేక దేశాలతో పాటు, మన దేశంలో కూడా విపత్తుల చట్టాన్ని రూపొందించారు. విపత్తుల నిర్వహణా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటికీ పూర్తిస్థాయి యంత్రాంగం ఏర్పడలేదు. విపత్తుల నిర్వహణ అన్నది కూడా, విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి జరిగే ప్రయత్నమే తప్ప, విపత్తుల నివారణ గురించిన దృష్టి తక్కువ. నాలుగు దశాబ్దాల కిందటి దివిసీమ ఉప్పెన తరువాత, కోస్తా ప్రాంతంలో తుఫానుల నుంచి రక్షణకు ఏమిచేయాలన్న ఆలోచన, కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ, ప్రతి ఏటా ఏదో ఒక స్థాయిలో వచ్చే వరదల గురించిన వ్యూహరచన మాత్రం జరగడం లేదు. 


ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. సముద్రం నుంచి వచ్చే తుఫాను, నేల మీద వచ్చే వరద కలిసి గోదావరి జిల్లాల ప్రాంతంలో బీభత్సం సృష్టించేవి. కోరంగి అనే ఒక సుప్రసిద్ధ రేవు పట్టణం అటువంటి వరదల్లోనే ధ్వంసమయింది. సర్ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం నిర్మించడం- ఆ ప్రాంతంలో విపత్తును నివారించడానికే కాక, నిలకడైన వ్యవసాయాభివృద్ధికి కారణమయింది. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన మూసీ వరదల తరువాత, అప్పటి నిజాం పాలకుడు, హైదరాబాద్కు శాశ్వత వరద నివారణ వ్యవస్థను, మంచినీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలకులలో ఉండే దూరదృష్టికి అవి ఉదాహరణలు. ఇప్పుడు కూడా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు కానీ, దానిలో భద్రతాపరిగణనలు భాగంగా ఉండడం లేదు. పైగా, పెరుగుతున్న పట్టణీకరణ- ఒకనాటి చెరువులను, నీటి వ్యవస్థలను తుడిచిపెట్టి కాంక్రీట్ మయంగా మారుస్తున్నది. హైదరాబాద్‌లో 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు, పట్టణానికి స్వార్థపరశక్తులు చేసిన చేటుకి ఫలితాలు. ముంబైలో, చెన్నైలో, బెంగుళూరులో సైతం వికృతపట్టణీకరణ ఫలితాలను చూస్తున్నాము. ఇప్పుడుతాజాగా వరంగల్ పట్టణం కూడా ఆ కోవలోకి చేరింది. నీటిదారులకు అడ్డుకట్టలు వేసి, భూములు ఆక్రమించి, భవనాలు నిర్మిస్తే ఏమవుతుంది, ఇళ్లలోకి నీళ్లు వస్తాయి, రోడ్లు కాలువలవుతాయి. 


తెలంగాణకు ఒక వరద నిర్వహణవ్యూహం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తరచుగా వచ్చే వరదలు తెలంగాణలో రావు. హైదరాబాద్లో, వరంగల్లో తెచ్చుకున్నట్టు కష్టపడి తెచ్చుకుంటే అది వేరే సంగతి. అటు కృష్ణ, ఇటు గోదావరి రెండూ కూడా పీఠభూమికి లోతట్టునే ప్రవహిస్తున్నాయి. ఎగువున ఉండే నివాసప్రాంతాలలో చెరువులే జలవ్యవస్థలు. అందుకే, తెలంగాణలో నీటి పారుదల ప్రణాళిక, నదులను, చెరువులను సంధానం చేయడం అనే వ్యూహంతో సాగుతున్నది. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న చెరువులు కూడా భారీ వర్షాల వల్ల కట్టలు తెగిపోయి పంటపొలాల్లోకి ప్రవహిస్తాయి. గ్రామాలు కూడా ఇబ్బంది పడతాయి. ఆ నష్టాన్ని కనీసంగా మాత్రమే ఉంచడానికి ఒక వ్యూహం అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు అంటే, వరదలు, తుఫానులు అన్న ధోరణే ఉండేదని తెలంగాణ ఉద్యమకారులు అంటారు. తెలంగాణలో తరచు ఏర్పడే కరువులు, వర్షాభావ పరిస్థితులను విపత్తుగా గుర్తించేవారు కాదన్నది వారి విమర్శ. సరే, ఇప్పుడు విభజన తరువాత, ఎవరి విపత్తులను వారు నిర్వచించుకుని వ్యూహాలు రచించుకోవాలి. తెలంగాణకు కాటకాలతో పాటు, భారీ వర్షాలు కూడా వస్తే ఏమి చేయాలో ఒక ప్రణాళిక ఉండాలి. దానిని అమలుచేయడానికి వ్యవస్థా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించే కొత్త విధానమేమిటన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది.


యాభై ఏళ్లలో ఇంతటి వర్షం రాలేదు అని కొన్ని ప్రాంతాలవారు అనుకుంటున్నారు. దీని వల్ల నష్టం అపారంగా ఉండదని, దీర్ఘకాలికంగా ఉపయోగమే ఉండగలదని ఆశించాలి. ప్రభుత్వాలు కరోనా, వర్షాకాలపు వ్యాధులు, వరదలు- ఈ మూడింటిని ఏకకాలంలో ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.

Updated Date - 2020-08-19T06:30:31+05:30 IST