Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్షం తగ్గింది.. వరద ముంచింది!

  • నెల్లూరులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు
  • చెరువులకు గండ్లు..ముప్పులో ఊళ్లు
  • పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు


నెల్లూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వర్షం లేదు.. కొన్నిరోజులుగా అలుముకున్న మబ్బులు కూడా మంగళవారం తొలగిపోయాయి. పొద్దున్నే పెళపెళలాడుతూ ఎండ కాసింది. వాతావరణం ఇంత పొడిగా ఉన్నా.. నెల్లూరు వాసుల కంట్లో తడి మాత్రం ఆరడం లేదు. కారణం... ముంచెత్తున్న వరద! ఈ జిల్లాలో 1,746 చెరువులు ఉండగా మంగళవారం నాటికి వరద ఉధృతి కారణంగా 1334 చెరువులు పూర్తిగా నిండాయి. కొన్ని చెరువులకు ఇప్పటికే పడిన గండ్లతో పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మరికొన్ని చెరువులు ఎప్పుడు తెగుతాయోనని దిగువ గ్రామాల ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో నిత్యావసర సరుకులు కూడా దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. మనుబోలు మండలం బద్దెవోలు రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో ఐదు తీర ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలు పెద్ద చెరువు ప్రమాదకరస్థాయికి చేరడంతో కలుజు వద్ద కట్ట తెంచారు. బాలాయపల్లి మండలంలో కైవల్య నది ఉప్పొంగడంతో నిండలి, వాక్యం, కడగుంట, రామాపురం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. నాయుడు చెరువు కట్టకు గండి కొట్టి ప్రమాదస్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు సమీపంలో చెప్టాపై వరదనీరు పారుతుండడంతో సైదాపురం, పొదలకూరు, రాపూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అలానే వేములపాలెం వద్ద చప్టాపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 8 గ్రామాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఇక... అనంతసాగరం మండలంలో కొమ్మలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తపల్లి- కచేరి దేవరాయ పల్లి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. వరికుంటపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అనంతసాగరం - సోమశిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం అటవీ ప్రాంతంలో పులిగుంట కట్టకు గండి పడడంతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పూసల కాలనీ మీదుగా వరద పారుతోంది. నెల్లూరు రూరల్‌ మండలంలోని ములుమూడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో రాకపోకలు ఆగిపోయాయి.

Advertisement
Advertisement